- నేడు 16 జిల్లాల్లో ఎగ్జామ్స్.. వన్ మినిట్ రూల్ పక్కా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ఎగ్జామ్స్ షురూ అయ్యాయి. తొలిరోజు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పేపర్-1 పరీక్షకు రెండు సెషన్లలో కలిపి మొత్తం 72.99 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మార్నింగ్ సెషన్‌లో 41 సెంటర్లలో 15,032 మంది అభ్యర్థులకు గాను 10,959 మంది (72.9%) పరీక్ష రాశారు. మధ్యాహ్నం సెషన్‌లోనూ 41 సెంటర్లలో 14,162 మందికి గాను 10,352 మంది (73.10%) అటెండ్ అయ్యారు.
మొత్తంగా తొలిరోజు 29,194 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయాల్సి ఉండగా, 21,311 మంది హాజరయ్యారని టెట్ కన్వీనర్ గాజర్ల రమేశ్తెలిపారు. వివిధ కారణాల వల్ల 7,883 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయలేదు. అయితే, పరీక్షలో క్వశ్చన్లు మధ్యస్తంగా వచ్చాయని అభ్యర్థులు చెప్పారు. రెండో రోజు బుధవారం రాష్ట్రంలోని 16 జిల్లాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మార్నింగ్ సెషన్ కోసం 55 సెంటర్లు, ఆఫ్టర్ నూన్ సెషన్ కోసం 57 సెంటర్లను సిద్ధం చేశారు. ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతించే విషయంలో ‘వన్ మినిట్ రూల్’ పక్కాగా అమలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
