నన్ను అరెస్ట్ చేస్తే నోటీస్ ఇవ్వాలి కదా?

 నన్ను అరెస్ట్ చేస్తే నోటీస్ ఇవ్వాలి కదా?

అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ కావటంతో... బయటకు వచ్చిన ఈటల రాజేందర్ ను అసెంబ్లీ నుంచి రక్షక్ వెహికిల్ లో తీసుకెళ్లారు పోలీసులు. తన వాహనంలో కాకుండా పోలీస్ వాహనంలో తీసుకెళ్లడంపై ఈటల ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేస్తే నోటీస్ ఇవ్వాలి కదా అని అడగగా పోలీసులు సమాధానం చెప్పట్లేదని తెలిసింది. పార్టీ ఆఫీస్ దగ్గరకు వెళ్తానని చెప్పినా వినకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తానేమైనా బానిసనా అని ఈటల ఈ సందర్భంగా  ప్రశ్నించారు. పోలీసులు ఈటలను శామీర్ పేటలోని తన నివాసానికి తరలించారు.

అంతకు ముందు స్పీకర్ పై చేసిన వ్యాఖ్యల మీద ఈటల క్షమాపణ చెప్పకపోవటంతో సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అయితే సస్పెన్షన్ తర్వాత సభ నుంచి ఈటల భయటకు వెళ్లాలని స్పీకర్ కోరారు . ఈటల రాజేందర్ స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు . స్పీకర్ పై ఈటల వ్యాఖ్యలు సరికాదన్నారు. చర్చ కంటే బీజేపీ రచ్చ చేయాలని చూస్తుందని మండిపడ్డారు. అయితే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన ఈటల రాజేందర్... సభ్యుడిగా సభలో మాట్లాడే అవకాశం ఉందా? లేదా ?... అని ప్రశ్నించారు.  స్పీకర్ పై నాకు గౌరవం ఉందా.. లేదా అనేది ఇతరులు ఎలా డిసైడ్ చేస్తారని ఈటల సీరియస్ అయ్యారు . ఆ తర్వాత ఈటలను సస్పెండ్ చేస్తూ  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టారు . దీనికి స్పీకర్ ఆమోదం తెలిపారు.