హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్) రాసిన వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. పరీక్షలు జరిగి రెండు నెలలు దాటినా.. ఇప్పటికీ ఫలితాల ఊసే లేకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా అర్హత సాధించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ గతేడాది డిసెంబర్ 22, 23, 24 తేదీల్లో పరీక్ష నిర్వహించింది. మొత్తం 29 సబ్జెక్టులకు సంబంధించిన ఈ పరీక్షను 18 కేంద్రాల్లో ఆన్‌లైన్ పద్ధతిలో పెట్టారు. సుమారు 80 శాతం మంది పరీక్ష రాశారు.
ఫలితాలు త్వరగానే వస్తాయని భావించినప్పటికీ కానీ, టీజీ సెట్ జరిగి 75 రోజులు దాటినా అప్డేట్ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో ఫలితాల వెల్లడిలో దొర్లిన తప్పులు, పారదర్శకత లేకపోవడం వంటి కారణాలతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నెలకొన్న నిశ్శబ్దం అభ్యర్థుల్లో మరింత అయోమయాన్ని నింపుతున్నది. ఫలితాలు ఆలస్యమైతే తాము ఇతర నోటిఫికేషన్లకు సిద్ధమయ్యే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతాయని అభ్యర్థులు వాపోతున్నారు.
అధికారులు వెంటనే స్పందించి టీజీ సెట్ తుది ఫలితాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఫలితాలను త్వరలోనే రిలీజ్ చేస్తామని టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ బి. శ్రీనివాస్ ‘వెలుగు’తో చెప్పారు. రిజల్ట్‌ను పకడ్బందీగా ఇచ్చేందుకే ప్రయత్నిస్తున్నామని.. అందుకే కొంత ఆలస్యమవుతున్నదని పేర్కొన్నారు.
