సర్వీస్ డాక్టర్లకు అన్యాయం చేయొద్దు : టీజీజీడీఏ

సర్వీస్ డాక్టర్లకు అన్యాయం చేయొద్దు :  టీజీజీడీఏ
  •     ప్రభుత్వానికి టీజీజీడీఏ విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొత్త నియామకాలు చేపట్టే ముందు.. అర్హులైన సర్వీస్ డాక్టర్ల సరెండర్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం (టీజీజీడీఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), ప్రభుత్వానికి సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. 

డీహెచ్, వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఎంతో మంది అర్హులైన పీజీ డాక్టర్లు.. మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీగా చేరేందుకు ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. సరెండర్ ప్రక్రియను పూర్తి చేయకుండానే కొత్తగా రిక్రూట్‌‌మెంట్ చేపడితే.. ఇప్పటికే సర్వీసులో ఉన్న డాక్టర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీజీజీడీఏ ఆవేదన వ్యక్తం చేసింది. 

దీనివల్ల వారి సీనియారిటీ దెబ్బతినడమే కాకుండా, ప్రమోషన్లలో నష్టం జరుగుతుందని పేర్కొంది. అనుభవం ఉన్న ప్రభుత్వ డాక్టర్లను పక్కనబెట్టి కొత్తవారిని తీసుకుంటే.. హాస్పిటల్స్‌‌లో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని హెచ్చరించింది. అర్హత, సీనియారిటీ ఆధారంగా పారదర్శకంగా పోస్టింగులు ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ డాక్టర్లు, వైద్య విద్య, ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే సరెండర్ ప్రక్రియను పూర్తి చేయాలని టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బి. నరహరి, నేతలు డాక్టర్ ఆర్. లాలు ప్రసాద్ రాథోడ్, డాక్టర్ మహ్మద్ ఖాజా రౌఫుద్దీన్ కోరారు.