ఇసుక దోపిడీపై ఎంక్వైరీ

ఇసుక దోపిడీపై ఎంక్వైరీ
  • కంప్లయింట్​ రావడంతో  దర్యాప్తు చేయిస్తున్న టీజీఎండీసీ

హైదరాబాద్​, వెలుగు : తెలంగాణ మినరల్  డెవలప్​​మెంట్​ కార్పొరేషన్​(టీజీఎండీసీ) లో తప్పుడు పత్రాలతో ఇసుక దోపిడీపై ఇంటర్నల్​ ఎంక్వైరీని రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్నది. ఎక్కడ, ఎవరి ఆధ్వర్యంలో, ఎలా ఇసుక పక్కదారి పట్టిందనే దానిపై విచారణ చేయిస్తున్నది. బల్క్​ బుకింగ్​ యూజర్లు, బల్క్​ బుకింగ్​ ఆర్డర్లు​ఎన్ని ఉన్నాయి, గత 9 నెలల కాలంలో ఎక్కడెక్కడ ఎంతెంత ఉందనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. తప్పుడు పత్రాలు ఉన్నట్లు గుర్తిస్తున్న ప్రతి బుకింగ్​ను బ్లాక్​లో పెడుతున్నారు. ఈ వ్యవహారంలో టీజీఎండీసీ అధికారులు ఎవరున్నారనే దానిపై  విచారణ చేస్తున్నారు. ప్రస్తుత టీజీఎండీసీ మేనేజింగ్​ డైరెక్టర్​ మల్సూర్​ ఈ అంశాన్ని సీరియస్​గా తీసుకున్నారు.

 లారీల యజమానులు కంప్లయింట్​ చేయడంతో పాటు ఆందోళన చేస్తుండడంతో ఏం జరిగిందనే దానిపై కూపీ లాగితే అసలు విషయం బయటపడింది. ఇసుక డీడీల దందా జరగకుండా రెండేండ్ల కిందటి నుంచే  ప్రభుత్వం ఆన్‌‌లైన్  వ్యవస్థను తీసుకువచ్చింది.  ఈ క్రమంలో బల్క్​ యూజర్​ ఐడీ నుంచి  ఇసుక కోసం వెబ్‌‌సైట్‌‌లో అప్‌‌లోడ్  చేసిన పేపర్లను పరిశీలించి అంతా ఓకే అనుకున్నాకే ఇసుక డీడీలను మంజూరు చేస్తోంది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తరువాత టీజీఎంఎడీసీని ఇంకింత ప్రక్షాళన చేసింది. డిప్యూటేషన్​పై ఉన్న అధికారులను సొంతగూటికి పంపింది. ఇసుక ఆదాయానికి గండిపడకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులకు స్పష్టం చేసింది. గతంలో ఎండీగా సమర్థవంతంగా పనిచేసిన మల్సూర్​కు తిరిగి బాధ్యతలు అప్పగించింది. మళ్లీ బాధ్యతలు  తీసుకున్న నెల రోజుల వ్యవధిలోనే అక్రమ ఇసుక దోపిడీ వ్యవహారాన్ని మల్సూర్  బయటపెట్టారు.