- అదనపు సిబ్బందిని నియమించుకోవాలి
హనుమకొండ, వెలుగు: భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లకు స్పీడ్ గా రిపేర్లు చేయాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ లో ఖమ్మం, మహబూబాబాద్ సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మహబూబాబాద్ సర్కిల్ పరిధిలో 1,800 పోల్స్, 179 ట్రాన్స్ ఫార్మర్లు, 41 గద్దెలు, ఖమ్మం సర్కిల్ లో 3,780 పోల్స్, 290 ట్రాన్స్ఫార్మర్లు, 270 గద్దెలు దెబ్బతినడంతో మార్చాల్సి ఉందన్నారు. వెంటనే పునరుద్ధరించేందుకు అదనపు సిబ్బందిని నియమించుకుని.. స్పీడ్ గా పనులు పూర్తి చేయాలని సూచించారు.
మిగతా సర్కిళ్లలోని ఏడీఈ, ఏఈలను వినియోగించుకోవాలని, అన్ని సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఎక్కువ మంది కాంట్రాక్టర్లతో పనులు చేయాలని, అవసరమైతే లైన్ల రీ రూటింగ్ చేపట్టాలని, వాగుల నుంచి 500 మీటర్ల దూరంలో 9.1 మీటర్ల స్తంభాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆపరేషన్స్ఇన్చార్జ్ డైరెక్టర్ టి.మధుసూదన్ , సీజీఎంలు కిషన్, అశోక్ , బికంసింగ్, జీఎంలు నాగప్రసాద్, అన్నపూర్ణ, ఎస్ఈ అంకుష్ పాల్గొన్నారు.
లంచం అడిగితే కంప్లయింట్ ఇవ్వండి
టీజీఎన్పీడీసీఎల్పరిధిలో అవినీతి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కట్టుబడి ఉందని, సిబ్బంది కస్టమర్లను ఇబ్బంది కలిగిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించింది. అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే సంస్థ విజిలెన్స్ వింగ్ ఫోన్ 92810 33233 నంబర్ కు లేదంటే ఏసీబీ టోల్ ఫ్రీ 1064 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించింది. తమ సమస్యలను 'ఎన్పీడీసీఎల్ గ్రీవెన్స్ పోర్టల్'లో కూడా ఫిర్యాదు చేయొచ్చని సంస్థ కోరింది.