హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పలు ఉద్యోగ పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) రిలీజ్ చేసింది. ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చి దరఖాస్తులు స్వీకరించిన నాలుగు ప్రధాన విభాగాల పోస్టులకు రాతపరీక్షల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసింది.
అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి నవంబర్ రెండో వారం వరకు ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ హరిత ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం.. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిధిలోని అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2) పోస్టులకు అక్టోబర్ 24న పరీక్ష జరగనుంది.
అదే బోర్డులోని అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టుల రాతపరీక్షను అక్టోబర్ 26న నిర్వహించనున్నారు. రోడ్లు, భవనాల శాఖలో ఏఈఈ ఉద్యోగాల పరీక్షను నవంబర్ 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ (డిప్యూటీఈవో), గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-1 (జీహెచ్ఎం) పోస్టులకు నవంబర్ 12, 13 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈ నియామక పరీక్షలన్నింటినీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలోనే ఆన్‌లైన్‌లో చేపడతామని సెక్రటరీ స్పష్టం చేశారు.
