
హైదరాబాద్, వెలుగు: ఈ నెలాఖరులోగా గ్రూప్–2 సెలక్షన్ లిస్టును రిలీజ్ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కసరత్తు చేస్తోంది. దీంతో తుది ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. కాగా, రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం గతేడాది డిసెంబర్‌లో టీజీపీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు 2,49,964 మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు.
దీనికి సంబంధించి ఫలితాలను మార్చిలో రిలీజ్ చేసింది. మొత్తం 2,36,649 జనరల్ ర్యాకింగ్ లిస్ట్‌ను వెల్లడించింది. ఇప్పటికే నాలుగు విడతల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా 18 రకాల పోస్టులకు సంబంధించిన గ్రూప్ 2 ఫైనల్ లిస్టును రెడీ చేస్తున్నారు. ఈ నెల 29 లేదా 30 తేదీల్లో ఫైనల్ సెలక్షన్ లిస్టు విడుదల చేయాలని టీజీపీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక గ్రూప్ 3 ఫైనల్ రిజల్ట్‌పై దృష్టి పెట్టనున్నది.