
హైదరాబాద్, వెలుగు: గిగ్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, ఈ అంశాన్ని ప్రభుత్వం తీసుకురానున్న కొత్త చట్టంలో చేర్చాలని తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు న్యాయం, వేతన భద్రత, సామాజిక రక్షణ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
ప్రభుత్వం తీసుకురానున్న చట్టంలో గిగ్ వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలన్న అంశం లేదన్నారు. అయితే, ఈ చట్టం కార్మికుల భద్రత, సంక్షేమం కోసం ఉండాలి తప్ప కంపెనీల కోసం కాదన్నారు. కనీస వేతనం ఇవ్వడం, ప్లాట్‌ఫామ్ కంపెనీలు రోజువారీ లేదా గంటల వారీగా కనీస వేతనం చెల్లించేలా నిబంధనలు చేర్చాలని, రోజుకు రూ.700 లేదా దాని సరిపోలే ఆదాయం ఉండేలా నిర్ధారించాలని కోరారు. గిగ్ కార్మికులకు కనీస వేతనం చట్టబద్ధ హక్కుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. టైమ్ ప్రకారం మారుతున్న ప్లాట్‌ఫామ్ చెల్లింపులపై నియంత్రణ ఉండేలా చట్టాన్ని బలోపేతం చేసి, కార్మికుల రక్షణ కోసం గిగ్ బోర్డును స్వతంత్రంగా పనిచేసేలా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.