సమ్మర్ విద్యుత్ డిమాండ్‌పై యాక్షన్ ప్లాన్ రెడీ చేయండి

సమ్మర్ విద్యుత్ డిమాండ్‌పై యాక్షన్ ప్లాన్ రెడీ చేయండి
  • అధికారులకు టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎండా కాలంలో విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. శుక్రవారం ఆయన మింట్ కాంపౌండ్ కార్పొరేట్ ఆఫీసులో ట్రాన్స్‌కో, టీజీఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.."వచ్చే ఏడాది రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 19,500 మెగావాట్ల నుంచి 20 వేల మెగావాట్లకు పెరగనుంది. ఈ డిమాండ్‌ను ఎదుర్కోవడానికి  సౌత్ డిస్కమ్ ప్రాంతంలో 3,866 అదనపు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 431 అప్‌గ్రేడ్ పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలి.

 జూబ్లీహిల్స్, మాదాపూర్, మణికొండ, గచ్చిబౌలి తదితర సబ్‌స్టేషన్లలో  ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలి. గ్రేటర్ హైదరాబాద్ లో 70 శాతం లోడ్‌ను మోస్తున్న 500 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను 1000 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌లతో భర్తీ చేయాలి. దీని వల్ల స్థలం సమస్య కూడా తగ్గుతుంది. దీనిపై వారంలోగా వివరణాత్మక ప్రణాళికలను సిద్ధం చేయండి. అక్టోబర్ చివరి నాటికే యాక్షన్ ప్లాన్ అమలు ప్రారంభించాలి" అని అధికారులను ఆదేశించారు. ప్లాన్ లో భాగంగా అన్ని పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ముషారఫ్ ఫరూఖీ స్పష్టం చేశారు.