ముషీరాబాద్, వెలుగు: నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ ఘటన మరువకముందే ఆర్టీసీ బస్ భవన్ సెల్లార్లో అగ్నిప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా సెల్లార్‌లోని యూపీఎస్‌లు దగ్ధమయ్యాయి. పేపర్లు పెద్ద ఎత్తున ఉండడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. బస్ భవన్లో సుమారు 800 మంది ఉద్యోగులు పని చేస్తుండగా, మేడారం జాతర కొనసాగుతున్నందున బస్ భవన్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండడం, ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయం కావడంతో తొక్కిసలాట లేదా ప్రాణాపాయం తప్పిందన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు విచారణలో తేలుతాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కొద్దిసేపు ముందే ఎండీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.
