
గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ లోని తెలంగాణ వ్యవసాయ వర్సిటీకి దాదాపు ఆరేండ్ల తర్వాత ఆర్టీసీ బస్సులు పునఃప్రారంభమయ్యాయి. 2019లో అర్ధాంతరంగా బస్సు సర్వీసులు నిలిపివేయడంతో వర్సిటీ, వివిధ కేంద్ర పరిశోధన సంస్థల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, ఈ సంస్థలను సందర్శించే రైతులు రవాణా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది వీసీగా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఆర్టీసీ ఆరు నెలల ట్రాఫిక్ సర్వే తర్వాత, అక్టోబర్ 1న సర్వీసుల పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం వీసీ జానయ్య, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం. రాజశేఖర్ ఈ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసులతో 80 శాతం మహిళా విద్యార్థులు, సిబ్బంది మహాలక్ష్మి పథకం ప్రయోజనాలు పొందుతారని తెలిపారు. బస్సులు లేని కారణంగా గతంలో 2 కి.మీ. నడవాల్సి వచ్చేదన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఈ.సి.హెచ్ విద్యాసాగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.