కాశీబుగ్గ, వెలుగు: బస్టాండ్లలో మౌలిక వసతులు మెరుగుపర్చాలని టీజీఎస్ ఆర్టీసీ వీసీ, ఎండీ వై.నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వరంగల్, హనుమకొండ బస్టాండ్లు, డిపోలు, జోనల్ శిక్షణా కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేసి, ప్రయాణికులతో మాట్లాడి బస్సుల వేళలు, సౌకర్యాలు, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
అనంతరం ఆర్‌ఎం ఆఫీస్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాట పట్టించే దిశగా అధికారులు, సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని సూచించారు. బస్టాండ్లలో పరిశుభ్రత, తాగునీరు, ఇతర మౌలిక వసతులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రాజశేఖర్‌తో పాటు ఇతర అధికారులు, డిపో మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
