కోలీవుడ్ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు దళపతి విజయ్‌పై ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ వ్యక్తిత్వాన్ని కొనియాడుతూనే, ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న రాజకీయ పరిస్థితులపై పోసాని ఘాటుగా స్పందించారు.
"విజయ్, వాళ్ల నాన్నగారు నాకు 1996 నుంచే తెలుసు. ఆయనది దేనికోసం పాకులాడే మనస్తత్వం కాదు. ప్రస్తుతం ఆయన చుట్టూ ఎన్నో వివాదాలు, గొడవలు సృష్టిస్తున్నా సరే.. విజయ్ మాత్రం ఎంతో ఓపికగా, సంయమనంతో ఉంటున్నారు" అని పోసాని పేర్కొన్నారు.
అంతేకాకుండా రాజకీయాల్లో విజయ్‌ని ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతోందని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. "విజయ్‌ను ఒక అభిమన్యుడిని చేసేశారు. ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడానికి వెనుక పెద్ద కుట్రే జరుగుతోంది. గవర్నర్ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అయితే, నేను గవర్నర్‌ను విమర్శించడం లేదు కానీ, అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే పక్షపాతం స్పష్టంగా కనిపిస్తోంది" అని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం విజయ్ రాజకీయ పార్టీ రాష్ట్ర ఎలక్షన్స్ లో విజయం సాధించిన తరుణంలో పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
