పాపం చిన్న పిల్లలు.. పెరుగుతున్న పోషకాహారం కేసులు..

పాపం చిన్న పిల్లలు.. పెరుగుతున్న పోషకాహారం కేసులు..

మహారాష్ట్రలో పెరుగుతున్న టీబీ కేసులు ఇప్పటికే కలవరపెడుతుండగా.. ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతోంది. థానే జిల్లాలో వెయ్యి కంటే ఎక్కువ పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారట. ప్రస్తుతం జిల్లాలో 83 తీవ్రమైన పోషకాహార లోపం కేసులు, 1,161 సాధారణ  పోషకాహార లోపం కేసులు నమోదయ్యాయని ఇటీవలే ఓ అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

పోషకాహార లోపాన్ని అంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) మనుజ్ జిందాల్ తెలిపారు. అంతకుముందు ఆయన జిల్లాలోని షాహాపూర్ తాలూకాలో పోషకాహార లోపంతో బాధపడుతున్న కొంతమంది పిల్లల కుటుంబాలను పరామర్శించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్యను తగ్గించేందుకు జిల్లాలో 'కుపోషణ్‌ ముక్తిసతి దత్తక్‌-పాలక్‌ అభియాన్‌' అనే స్కీంను చేపట్టామని, ప్రభుత్వ అధికారులు ఒక్కొక్కరిని దత్తత తీసుకుని అతని/ఆమె సంరక్షణ బాధ్యతలు చేపడతారని ఆ ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా సీఈవో గ్రామాల్లోని ప్రజారోగ్య కేంద్రాలు, శిశువైద్య కేంద్రాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. దత్తత తీసుకున్న పిల్లలతో ప్రతి 15 రోజులకోసారి అధికారులు టచ్‌లో ఉండాలని, అలాగే అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా (గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్త), వైద్యులు, నర్సులు, సూపర్‌వైజర్లు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లలను ప్రతిరోజూ సందర్శించి వారిని చెక్ చేయాలని ఆదేశించారు.