పండుగ రంగులు ఇంట్లోనే..

పండుగ రంగులు ఇంట్లోనే..

హోలీ అంటే ఇంద్రధనస్సు నేలపైకి వచ్చినట్టే. చిన్నాపెద్దా అందరూ రంగులతో తడిసి ముద్దవుతారు. రంగు నీళ్లు చల్లుకుంటూ సంబురాలు జరుపుకుంటారు. కానీ, కెమికల్స్​తో నిండిన ఆ రంగులు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అలాగని హోలీకి దూరంగా ఉండలేం కదా! అందుకే ఇంట్లోనే నేచురల్​ ఇంగ్రెడియెంట్స్​తో కలర్స్​ తయారు చేసుకోవాలి. మరి వాటిని ఎలా ప్రిపేర్​ చేసుకోవాలంటే..

బయటి నుంచి తీసుకొచ్చే కలర్స్​లో  సాల్వెంట్స్​ ఎక్కువగా ఉంటాయి. వాటివల్ల తామర లాంటి స్కిన్​ ఇన్ఫెక్షన్స్​ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే రంగుల్లో ఉండే కాపర్​ సల్ఫేట్​ కళ్లకి చాలా డేంజర్​. రంగుల్లోని అల్యూమినియం బ్రోమైడ్, మెర్క్యురీ సల్ఫేట్​ కూడా చర్మానికి హాని చేస్తాయి. అందుకే వీటికి బదులుగా కెమికల్​ ఫ్రీ రంగులతో హోలీ ఆడాలి. వీటి తయారీకి ఎక్కువ ఇంగ్రెడియెంట్స్​తో పనిలేదు. శనగపిండి​, మైదా లేదా కార్న్​ఫ్లోర్​లో ​ఏ ఒక్కటి  ఉన్నా చాలు. అయితే ముందుగా టెస్టింగ్​ ప్రాసెస్​లో కొద్ది మొత్తంలోనే  రంగులు చేసుకోవాలి. 

పసుపు

ఎనభై శాతం మైదాలో ఇరవై శాతం పసుపు వేయాలి. ఆ మిశ్రమం ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసేలా  చేతులతో బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని రెండు మూడు సార్లు జల్లెడ పడితే పసుపు రంగు రెడీ. అలాగే ఒకటిన్నర కప్పు నీళ్లలో మూడు టేబుల్​ స్పూన్ల పసుపు వేసి మరిగించాలి. నీళ్లు పూర్తిగా చల్లారాక కార్న్​ఫ్లోర్​ వేసి కలిపినా ఇంట్లోనే​ పసుపు రంగు తయారవుతుంది.

ఎరుపు

పసుపులో నిమ్మరసం కలిపితే ... దానిలోని ఎసిడిక్​ నేచర్​ పసుపుని ఎర్రగా మార్చేస్తుంది. ఆ మిశ్రమాన్ని కొన్ని గంటలు గాలి తగిలేచోట ఉంచి..పూర్తిగా ఆరాక చేతులతో పొడి పొడిగా చేయాలి. లేదంటే మిక్సీ అయినా పట్టొచ్చు. ఆ తర్వాత జల్లెడ పడితే హోలీ పండుగకి ఎరుపు రంగు రెడీ. అయితే ఆ మిశ్రమాన్ని ఆరబెట్టేటప్పుడు ఎండ తగలకూడదు. ఎండ తగిలితే రంగు వెలిసిపోతుంది. 

గులాబీ

రెండు కప్పుల బీట్​రూట్​ తురుములో ఒక కప్పు నీళ్లు పోయాలి. నీళ్లు పూర్తిగా గులాబీ రంగులోకి మారే వరకు ఆ మిశ్రమాన్ని చేత్తో బాగా కలపాలి. తర్వాత వడకట్టి...బీట్​రూట్​ జ్యూస్​ వేరు చేయాలి. దాన్ని కార్న్​ఫ్లోర్​​లో కలిపితే గులాబీ రంగు రెడీ. అచ్చు ఎరుపు రంగు ప్రాసెస్​లోనే గులాబీ రంగుని కూడా తయారుచేసుకోవచ్చు. కాకపోతే ఈ రంగు కోసం వీలైనంత తక్కువ నిమ్మరసం వాడాలి. పసుపులో కొంచెం నిమ్మరసం కలిపితే గులాబీ రంగు వచ్చేస్తుంది. 

ఆకుపచ్చ​

మిక్సీజార్​లో రెండు కప్పుల కొత్తిమీర, రెండు కప్పుల పాలకూర వేసి కొద్దిగా నీళ్లు పోసి జ్యూస్​ పట్టాలి. ఆ మిశ్రమాన్ని వడకట్టి.. అందులో మూడున్నర కప్పుల కార్న్​ఫ్లోర్​ వేయాలి.  ఆ తర్వాత ఒక రోజంతా ఎండబెట్టి మిక్సీ పడితే ఆకుపచ్చ రంగు రెడీ. అలాగే మైదా పిండి, గోరింటాకు  పొడిని సమపాళ్లలో తీసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత మిక్సీ  పడితే  గ్రీన్​ కలర్​ రెడీ. 

గోధుమ​  

రెండు వందల గ్రాముల కాఫీ పౌడర్​లో సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు బ్రౌన్​ కలర్​లోకి మారాక స్టవ్​ ఆపేయాలి. పూర్తిగా చల్లారాక కేజిన్నర కార్న్​ఫ్లోర్​లో దీన్ని వేసి చేతులతో కలపాలి. తర్వాత ఒక రోజంతా ఆరబెట్టి మిక్సీ పడితే కెమికల్​ ఫ్రీ బ్రౌన్​ కలర్​ హోలీకి రెడీ. కావాలనుకుంటే సువాసన కోసం  ఈ రంగులో కొద్దిగా అంటే 10 ఎమ్​ ఎల్​ రోజ్​ వాటర్​ కూడా కలపొచ్చు. 

ఊదా​  

నాలుగు నుంచి ఐదు బ్లాక్ క్యారెట్స్​ తీసుకుని మిక్సీ పట్టి పేస్ట్​ చేయాలి. ఆ మిశ్రమంలో 250 గ్రాముల కార్న్​ఫ్లోర్​ వేసి చేతులతో బాగా కలపాలి. పూర్తిగా ఆరాక చేతులతో పొడి చేసి  లేదా మిక్సీ పట్టి ఊదా రంగు​ రెడీ చేసుకోవచ్చు. 

బూడిద రంగు

ఉసిరి కాయలతోనూ కలర్​ఫుల్ గ్రే కలర్ తయారుచేయొచ్చు. అదెలాగంటే.. మిక్సీ జార్​లో ఉసిరి విత్తనాలు వేసి, కొద్దిగా నీళ్లు పోసి జ్యూస్​లా చేయాలి. ఆ జ్యూస్​ని కార్న్​ఫ్లోర్​లో వేసి బాగా కలపాలి. తర్వాత  ప్లేట్​లో సమంగా పరవాలి. . పూర్తిగా ఆరాక మిక్సీ పడితే గ్రే కలర్​ వస్తుంది. 

నీలం 

ఒక కప్పు నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల నీలం రంగు ఫుడ్​ కలర్​ వేయాలి. తర్వాత అందులో మూడు కప్పుల కార్న్​ఫ్లోర్​ వేసి చేతులతో బాగా కలపాలి. కాసేపు ఆరబెడితే నీలి రంగు రెడీ.

కాషాయం

రెండు క్యారెట్స్​ని చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. వాటిని మిక్సీ జార్​లో వేసి సరిపడా నీళ్లు పోసి పేస్ట్​ చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని చేత్తో పిండి లేదా వడకట్టి జ్యూస్​ తీయాలి. దాన్ని కార్న్​ఫ్లోర్​లో వేసి బాగా కలిపి ఆరబెట్టాలి. తర్వాత మిక్సీ జార్​లో వేసి పొడి చేస్తే ఆరెంజ్​ కలర్​ వచ్చేస్తుంది.