మున్సిపల్ కార్మికులకు పాజిటివ్ వచ్చిందని.. చెత్త ట్రాక్టర్ లో ఆస్పత్రికి తరలింపు

మున్సిపల్ కార్మికులకు పాజిటివ్ వచ్చిందని..  చెత్త ట్రాక్టర్ లో ఆస్పత్రికి తరలింపు

కమిషనర్ ఆఫీస్ ముందు తోటి కార్మికుల నిరసన

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: కరోనా సోకిన మున్సిపల్ కార్మికులను చెత్త ట్రాక్టర్లో ఆస్పత్రికి తరలించడం వివాదాస్పదమైంది. వీరంతా దళిత వర్గానికి చెందిన వారని, అందుకే ట్రాక్టర్ లో తరలించి వారిని చిన్న చూపు చూశారంటూ ఆదివారం తోటి కార్మికులంతా నిరసనకు దిగారు. సిద్దిపేట జిల్లా సీఎం కేసీఆర్ నియోజకవర్గమై న గజ్వేల్ -ప్రజ్ఞా పూర్ మున్సిపాలిటీ పరిధిలో పని చేస్తున్న100 మంది సఫాయి కార్మికులకు శనివారం శ్రీగిరిపల్లి ఆసుపత్రిలో కోవిడ్ టెస్టులు చేయించారు. 9 మందికి పాజిటివ్ గా తేలింది. వీరిలో ముగ్గురు మహిళలు. వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఇండ్లలో క్వారంటైన్ ఉండటం వీలుపడని పరిస్థితి. క్వారంటైన్ కోసం ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీ ఎమ్ కోవిడ్ ఆసుపత్రికి వీరిని తరలించాలని నిర్ణయించారు.

వీరందరిని వైద్య సిబ్బంది సహాయంతో అంబులెన్సులో తరలించాల్సి ఉంది. అలా కాకుండా మున్సి పల్ ఆఫీసర్లు వారిని నిత్యం చెత్త తరలించే ట్రాక్టర్లోనే ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తే ట్రాక్టర్ నడిపారు. వారంతా ఆసుపత్రికి చేరుకునేసరికి సాయంత్రమైంది. అప్పటికే బాగా అలసిపోయారు. హాస్పిటల్ సిబ్బంది వారిని వెంటనే చేర్చు కోకపోవడంతో అధికారులను, సిబ్బందిని బతిమలాడుతూ గంటల తరబడి వేచి ఉన్నారు. అయినా లాభం లేకపోవడంతో తోటి కార్మికులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. తోటి కార్మికులు, దళిత సంఘాల నాయకులు అక్కడకు చేరుకుని ఆసుపత్రి అధికారులతో  చాలాసేపు వాగ్వి వాదానికి దిగారు. చివరకు రాత్రి పొద్దుపోయాక వారిని చేర్చుకున్నారు. హాస్పిటల్ సిబ్బంది తీరు కారణంగా గంటలపాటు ఆకలికి అలమటిస్తూ అవస్థలు పడాల్సి వచ్చిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆఫీసర్ల నిర్లక్ష్యంపై ఆందోళన

దళిత వర్గానికి చెందిన 9 మంది సఫాయి సిబ్బందిని నిర్లక్ష్యంగా చెత్త ట్రాక్టర్ లో ఆస్పత్రికి తరలించడంపై తోటి కార్మికులు ఆదివారం ఉదయం పట్టణంలోని మున్సిపాలిటీ కమిషనర్ ఆఫీస్ ముందు బైఠాయించారు. వారికి ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న కమిషనర్ కృష్ణారెడ్డి , చైర్మన్ రాజమౌళిగుప్త అక్కడకు వచ్చి కార్మికులకు నచ్చజెప్పటానికి ప్రయత్నం చేశారు. కార్మికులను చెత్త ట్రాక్టర్ లో తరలించటం తప్పేనని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు. స్థానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి క్షమాపణ చెప్పడంతో కార్మికులు ఆందోళన విరమించారు.