Vijay Hazare Trophy: పాండ్య నెక్స్ట్ లెవల్ బ్యాటింగ్.. ఒకే ఓవర్లో 6,6,6,6,6,4తో విశ్వరూపం

Vijay Hazare Trophy: పాండ్య నెక్స్ట్ లెవల్ బ్యాటింగ్.. ఒకే ఓవర్లో 6,6,6,6,6,4తో విశ్వరూపం

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య విజయ్ హజారే ట్రోఫీలో విధ్వంసం సృష్టించాడు. టోర్నీ ప్రారంభం నుంచి బ్యాటర్లు సెంచరీలతో విజృంభిస్తున్న వేల తాను కూడా సెంచరీతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. శనివారం (జనవరి 3) విదర్భతో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా పార్థ్ రేఖడే వేసిన ఇన్నింగ్స్ 39 ఓవర్లో విశ్వరూపమే చూపించాడు. ఈ ఓవర్లో ఏకంగా 34 పరుగులు రాబట్టాడు. తొలి 5 బంతులను సిక్సర్లుగా మలిచిన హార్దిక్ పాండ్య.. చివరి బంతిని ఫోర్ కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో 34 పరుగులు వచ్చాయి. 

ఈ మ్యాచ్ లో 181 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బరోడాను హార్దిక్ ఆదుకున్నాడు. ఒంటి చేత్తో జట్టును నిలబెట్టాడు. ఒక్కడే క్రీజ్ లో నిలబడి విధ్వంసం సృష్టించాడు. వచ్చిన వారు వచ్చినట్టు విఫలమైనా.. పాండ్య సెంచరీతో వీరంగం సృష్టించాడు. ఓవరాల్ గా 92 బంతుల్లోనే 133 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. పాండ్య ఇన్నింగ్స్ లో 8 ఫోర్లతో పాటు 11 సిక్సర్లు ఉన్నాయి. జట్టు స్కోర్ లో పాండ్య ఒక్కడే దాదాపు 45 శాతం పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో పాండ్య విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే ఫామ్ ను విజయ్ హజారే ట్రోఫీలో కూడా కొనసాగించాడు.

ALSO READ : గిల్‌కు ఫుడ్ పాయిజనింగ్.. విజయ్ హజారేకి దూరం.. న్యూజిలాండ్ సిరీస్ ఆడతాడా..?

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు పాండ్య:
  
ఆసియా కప్ లో ఫైనల్ కు ముందు మోకాలి గాయంతో ఇబ్బంది పడిన పాండ్య పాకిస్థాన్ తో జరిగిన తుది సమరానికి దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఆ తర్వాత జరిగిన ఆసీస్ సిరీస్ కు అందుబాటులో లేడు. సర్జరీ నుంచి తప్పించుకున్న పాండ్య ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడి అద్భుతంగా రాణించాడు. వరుస గాయాలు పాండ్యను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆల్ రౌండర్ గా పాండ్య సేవలు టీమిండియా చాలా కీలకం. టీ20 వరల్డ్ కప్ ముగిసేవరకు బీసీసీఐ పాండ్యను కేవలం టీ20లకే పరిమితం చేయనున్నారు. దీంతో వన్డే సిరీస్ ఆడకపోయినా టీ 20 సిరీస్ లో కనిపించనున్నాడు.