Vijay Hazare Trophy: ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు.. గైక్వాడ్‌కు గట్టి పోటీ ఇస్తున్న RCB ప్లేయర్

Vijay Hazare Trophy: ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు.. గైక్వాడ్‌కు గట్టి పోటీ ఇస్తున్న RCB ప్లేయర్

టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీ క్రికెట్ లో పక్కాగా పరుగులు చేయాల్సిందే. డొమెస్టిక్ క్రికెట్ ప్రదర్శన ఆధారంగానే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తారు. అయితే కొన్ని సార్లు దేశవాళీ క్రికెట్ లో పరుగుల వరద పారించినా కొంతమందికి దురదృష్టవశాత్తు భారత స్క్వాడ్ లో చోటు దక్కదు. ఇలాంటి లిస్ట్ లో కర్ణాటక టాలెంటెడ్ బ్యాటర్ దేవదత్ పడికల్ ఉన్నాడు. కర్ణాటక స్టార్ బ్యాటర్  దేవ్‌దత్ పడిక్కల్ అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో రికార్డులను తిరగరాస్తూ టీమిండియా వన్డే జట్టులో స్థానం కోసం పోరాడుతున్నాడు. 

విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటివరకు 5 మ్యాచ్ లాడిన పడికల్ ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు. శనివారం (జనవరి 3) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో త్రిపురపై సెంచరీతో సత్తా చాటిన పడికల్ ఈ సీజన్ లో నాలుగో సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో ఓవరాల్ 120 బంతుల్లో 108 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఓవరాల్ గా లిస్ట్ ఎ ఫార్మాట్‌లో పడిక్కల్‌కు 13వ సెంచరీ. 

పడికల్ తన అసాధారణ ఆట కారణంగా జనవరి 11 నుంచి న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాప్-3లో అవకాశం లేకపోయినా.. మిడిల్ ఆర్థర్ లో శ్రేయాస్ అయ్యర్ కోలుకోకపోవడంతో అతని స్థానంలో ఈ కర్ణాటక బ్యాటర్ ఎంపిక కానున్నాడని టాక్. టీంఇండియాలో ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్నాడు. ఒకవేళ గైక్వాడ్ విఫలమైతే టీమిండియా యాజమాన్యం పడికల్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించే అవకాశాలు లేకపోలేదు. 

ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో పడికల్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐదు మ్యాచ్ ల్లో 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 514 పరుగులు సాధించాడు. జార్ఖండ్‌పై 147 పరుగులతో ఈ టోర్నీలో తొలి సెంచరీ తన ఖాతాలో వేసుకున్న 
ఈ కర్ణాటక బ్యాటర్.. ఆ తర్వాత కేరళపై 124 పరుగులు చేశాడు. తమిళనాడుపై 22 పరుగులు మాత్రమే చేసినా.. పుదుచ్చేరిపై 113 పరుగులతో మరో సెంచరీ చేశాడు. తాజాగా త్రిపురపై సెంచరీ చేసి టాప్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. 

2019-20లో పడికల్ తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ ఆడినప్పుడు 11 మ్యాచ్‌ల్లో 67 యావరేజ్ తో 609 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత ఏడాది ఇదే టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. 7 మ్యాచ్‌ల్లో 147 యావరేజ్ తో   737 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. 2023-24 సీజన్‌లో కేవలం 5 మ్యాచ్‌ల్లో 155 యావరేజ్ తో 465 పరుగులు.. గత సీజన్ లో 3 ఇన్నింగ్స్‌ల్లో 65 యావరేజ్ తో 196 పరుగులు చేసి అసాధారణ నిలకడ చూపించాడు. ఇంత నిలకడతో ఆడుతున్నా పడికల్ కు  ఇప్పటివరకు టీమిండియాలో పిలుపు రాకపోవడం విచారకరం.