శ్రీలంకలోని తుఫాన్ బాధితుల కోసం బీసీసీఐ తమ ఔదార్యాన్ని చాటుకుంది. శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని కలిగించిన దిత్వా తుఫాను బాధితులకు నిధులు సేకరించడానికి బీసీసీఐ రెండు టీ20 మ్యాచ్ లను అదనంగా ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం 2026లో శ్రీలంకలో టీమిండియా రెండు టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉంది. అయితే తుఫాన్ బాధితుల కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డు టీ20 సిరీస్ కు కూడా ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేసింది. లంక బోర్డు అభ్యర్ధన మేరకు బీసీసీఐ టీ20 సిరీస్ కు ఓకే చెప్పింది.
2026 ఆగస్టులో జరిగే శ్రీలంక పర్యటనలో భారత జట్టు టీ20 మ్యాచ్‌లను ఆడేందుకు బీసీసీఐ అంగీకరించిందని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) చైర్మన్ షమ్మీ సిల్వా వెల్లడించారు. ఈ అదనపు టీ20 మ్యాచ్ లు తుఫాను బాధితులకు సహాయపడతాయని పేర్కొంటూ సిల్వా.. బీసీసీఐ, టీమిండియాకు కృతజ్ఞతలు తెలిపారు. 2026లో శ్రీలంక మూడు టీ20.. మూడు వన్డే మ్యాచ్ ల కోసం ఇండియాలో పర్యటిస్తుంది. ప్రస్తుతం ఇండియా న్యూజిలాండ్ తో వన్డే, టీ20 సిరీస్ కోసం సిద్ధమవుతోంది. ఆ తర్వాత వరల్డ్ కప్.. ఐపీఎల్ ఆడాల్సి ఉంది. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ తో వైట్ బాల్ ఫార్మాట్.. ఆ తర్వాత శ్రీలంక టూర్ వెళ్తుంది.
దిత్వా తుఫాను ధాటికి శ్రీలంకలో చాలా ప్రాంతాలు నామారూపాల్లేకుండా పోయాయి. ఇండ్లు, రోడ్లు, బ్రిడ్జిలు నేలమట్టమయ్యాయి. తుఫాన్ ప్రభావంతో లంకలో 123 మంది చనిపోగా.. వందల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. దేశంలో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలో దిత్వా తుఫాను కారణంగా తలెత్తిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్నాయకే దేశమంతటా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
దిత్వా తుఫాన్‌తో అతలాకుతలమైన శ్రీలంకకు భారత ప్రభుత్వం సాయం ప్రకటించింది. మొత్తం 21 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌తో పాటు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పంపించింది. వరద బాధితులను ఆదుకోవడానికి 8 టన్నుల పరికరాలను కూడా పంపించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
