అమెరికా దెబ్బకు వణికిపోయిన వెనిజులా: దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు మదురో

అమెరికా దెబ్బకు వణికిపోయిన వెనిజులా: దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు మదురో

కారకాస్: వెనిజులాపై అమెరికా భీకర దాడులకు దిగింది. శనివారం (జనవరి 3) ఉదయం వెనిజులా రాజధాని కారకాస్ నగరంపై అమెరికా దళాలు మెరుపు దాడులు చేశాయి. కారకాస్ సిటీలోని భారీ భవనాలు, పోర్టులే లక్ష్యంగా మిస్సైళ్లు, బాంబులతో విరుచుకుపడ్డాయి. అమెరికా సైనిక దాడుల నేపథ్యంలో వెనిజులాలో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో. 

ఈ దాడులను వెనిజులా భూభాగంతో పాటు దేశ ప్రజలపై అమెరికా చేసిన అత్యంత తీవ్రమైన సైనిక దురాక్రమణగా ఆయన అభివర్ణించారు. అంతర్జాతీయ సమాజం ముందు అమెరికా దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కారకాస్ సిటీతో పాటు మిరాండా, అరగువా, లా గుయిరా రాష్ట్రాలలో కూడా దాడులు జరిగాయని వెనిజులా ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఈ దాడులకు అమెరికా అధికారికంగా బాధ్యత వహించలేదు. 

కొన్నాళ్లుగా అమెరికా, వెనిజులా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అమెరికాలోకి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ వెనిజులా నుంచి వస్తున్నాయని.. వీటిని వెంటనే అరికట్టాలని  వెనిజులా అధ్యక్షుడు మదురోను హెచ్చరించారు ట్రంప్. ఈ క్రమంలోనే డ్రగ్స్ అక్రమ రవాణాను ఎదుర్కోవటానికి సంబంధించి ఒప్పందం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ ప్రకటించారు.

అమెరికా ఒప్పందం వెనక మరో కారణం ఉందని.. అది ఆయిల్ అని.. చమురు ఒప్పందానికి పట్టుబడుతుందని.. ఆ విషయాన్ని నేరుగా చెప్పకుండా డ్రగ్స్ అక్రమ రవాణా పేరుతో దేశంపై ఒత్తిడి చేస్తుందంటూ వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ బహిరంగంగా ప్రకటన చేయటంతో.. అమెరికా మండిపడుతోంది. ఈ క్రమంలోనే జనవరి 3వ తేదీ అర్థరాత్రి వెనిజులా రాజధాని కారకాస్‎పై అమెరికా ఎయిర్ స్ట్రయిక్స్ చేసింది.