మన దేశంలో ఊబకాయ సమస్యను ఎదుర్కొంటున్న చాలా మంది రాత్రి భోజన సమయంలో అన్నం తినడం మానేస్తున్నారు. అన్నం బదులుగా చపాతీలు.. ఇతరత్రా తింటూ డైట్ మెయింటైన్ చేస్తుంటారు. అయినా సరే.. బరువు తగ్గడం లేదని బాధపడుతున్న ఊబకాయులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అయితే.. ఇందుకు పూర్తి భిన్నంగా జపాన్ ప్రజల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. జపాన్ ప్రజలు మూడు పూటలా అన్నం మాత్రమే తింటారు. అయినా సరే.. ఎంతో నాజూకుగా, ఆరోగ్యంగా ఉంటారు. జపాన్లో ఊబకాయ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా తక్కువ. మూడు పూటలా రైస్ తినే అలవాటు ఉన్నా బరువు పెరగకుండా జపాన్ ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి కారణాలు లేకపోలేదు.
ఇండియాలో చాలా మందికి అన్నం అసంపూర్తిగా తినడం ఇష్టం ఉండదు. కూరన్నం, సాంబారన్నం, పెరుగన్నం.. ఇలా ఫుల్ మీల్స్ తినేస్తారు. ఇక కొందరు బిర్యానీ ప్రియుల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చికెన్ ఫ్రై పీస్ అని, దమ్ అని.. మటన్ బిర్యానీ అని.. దొణ్ణె బిర్యానీ అని.. మండీల్లో ఒక పెద్ద ప్లేట్ ముందు పెడితే ముక్క మిగలకుండా లాగించేస్తారు. ఈ అలవాటు కారణంగానే ఇండియాలో అన్నం తినే చాలా మంది బరువు పెరుగుతున్నారని అధ్యయనాల్లో తేలింది. జపాన్ ప్రజలు అన్నం తినే విషయంలో ఒక కొలత పాటిస్తారు.
జపాన్లో అన్నం వండుకునేందుకు కొలిచి పోసుకునే రైస్ బౌల్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. జపాన్ ప్రజలు వినియోగించే రైస్ బౌల్ సైజ్ 140 గ్రాములు మాత్రమే. ఇది తింటే.. 200 క్యాలరీస్ మాత్రమే ఎనర్జీ వస్తుంది. ఇలా.. జపాన్ వాళ్లు అన్నం మానేయరు. అన్నం మితంగా తింటారు. అందువల్లే.. వాళ్లకు ఊబకాయం సమస్య దరిచేరదు. అంతేకాకుండా.. జపాన్ ప్రజలు అన్నం తినే ముందు మూడు పూటలు సూప్ తాగుతారు. ఇలా.. సూప్ తాగడం వల్ల ఎక్కువ అన్నం తినాల్సిన అవసరం రాదు. అతిగా తినకుండా జపాన్ ప్రజలు ఇలా కడుపు నింపుకుంటారు. అందుకే.. జపాన్ ప్రజలు నాజూగ్గా, ఆరోగ్యంగా ఉంటారు.
జపాన్ ప్రజలు స్నాక్స్, జంక్ ఫుడ్ పెద్దగా తినరు. భోజనం చేసే లోపు ఇలా స్నాక్స్, జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఊబకాయ సమస్య పెరుగుతుంది. ఇక.. జపాన్ ప్రజలు కొవ్వు కరిగించుకోవడానికి జిమ్ లకు వెళ్లరు. ఎందుకంటే.. జపాన్ ప్రజలు ఎక్కువగా కాలి నడకకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందువల్ల.. అన్నం తింటే కార్బోహైడ్రేట్ కారణంగా కొవ్వు పెరుగుతుందనే భయం జపాన్ ప్రజలకు ఉండదు. ఈ కారణాల వల్ల.. జపాన్ ప్రజలు మూడు పూటలా అన్నం తిన్నా సన్నగా, ఆరోగ్యంగా ఉంటున్నారు. బియ్యం.. అన్నం.. ఎప్పుడూ శత్రువు కాదు. మోతాదుకు మించి అన్నం తినడం వల్లే ఊబకాయం సమస్య వెంటాడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
