అమ్మా .. ఇవి తింటే చాల బలం వస్తుందట .. కమ్మగా ఉంటాయి.. చేసిపెట్టవా..!

అమ్మా .. ఇవి తింటే చాల బలం వస్తుందట ..   కమ్మగా ఉంటాయి.. చేసిపెట్టవా..!

 అమ్మమ్మ ఊరికో, పెద్దత్తమ్మ ఇంటికో పోతే శెనగగుడాలో, నువ్వుల ముద్దలో చేతిలో పెడితే... అబ్బ ఎంత బాగుందో అనుకుంట తింటం. మల్ల ఇంటికొచ్చినంక ఎప్పుడన్న అయి తినాలనిపిస్తే చేసుకోవడం రాదు. అప్పుడు అమ్మని అడిగితే వాటిని ఇట్ల తయారు చేసిస్తది... ఎంతో కమ్మగా ఉండే తినుబండారాలను ఎలా తయారు చేయాలో చూద్దాం. . .! 

శెనగ గుడాలు తయారీకి కావాల్సినవి:

శెనగలు: పావు కిలో, పసుపు: పావు టీ స్పూన్, ఉల్లితరుగు: అర కప్పు (ప్రొదవుగా తరిగినవి), పచ్చిమిర్చి 5. ఆవాలు: పావు టీ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్, వెల్లుల్లి: మూడు రెబ్బలు, కరివేపాకు: రెండు రెబ్బలు, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్ స్పూన్లు


తయారీ:శెనగలు రెండు మూడుగంటలు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత వాటిని గిన్నెలో వేసి, సరిపడా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టాలి. కుక్కర్లో ఉడకబెట్టకూడదు. ఎందుకంటే కుక్కర్​ లో  చాలా మెత్తగా ఉడికి గుడాలుగా పనికిరావు. పొయ్యి మీద అయితే కొంచెం మెత్తబడ్డాక దించేయచ్చు. నీళ్లు వడకట్టి, పొయ్యి మీద బాండీ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి), కరివేపాకు, ఉల్లి తరుగు వేసి కొద్దిసేపు వేగించాలి. తర్వాత శెనగలు వేసి వేగించాలి. పదినిమిషాలు వేగాక కొత్తిమీర చల్లితే శెనగ గుడాలు' రెడీ. సాయంత్రాలు స్నాక్స్ లా చేసుకు తింటే బాగుంటాయి. చిన్నపిల్లలయితే. మస్తు ఎంజాయ్ చేస్తారు.  


మొక్కజొన్న రొట్టెలు తయారీకి కావలసినవి

  • మొక్కజొన్న పిండి: పావుకిలో, నీళ్లు: తగినన్ని, ఉప్పు: తగినంత.

తయారీ విధానం:స్టవ్​ పై గిన్నెలో నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. మరిగిన నీళ్లలో మొక్కజొన్న పిండి వేస్తూ కలపాలి. పిండి ముద్దగా అయ్యాక చిన్న చిన్న ఉండలుగా చుట్టి రొట్టెలు చేసి, సన్నని మంట పెట్టి పెనం మీద కాల్చితే మొక్క జొన్నరొట్టెలు రెడీ. సాయంకాలం వీటిని అప్పటికప్పుడు చేసుకుతింటే సూపర్. ఏ కూరతో తిన్నా బాగుంటాయ్ కూరగాయలతోనే కాదు. చికెన్, మటన్ లతో కూడా తినొచ్చు.. జామ్ సాస్ కూడా తినొచ్చు పిల్లలకు బలం కూడా. పావుకిలో పిండితో ఐదు రొట్టెలు తయారవుతాయి.

నువ్వుల ముద్దలు తయారీకి కావలసినవి

  • నువ్వులు : అరకిలో, బెల్లం  అరకిలో కంటే కొంచెం తక్కువ

తయారీ విధానం: స్టవ్​ పై గిన్నె పెట్టి నువ్వులు వేసి వేగించాలి. నువ్వులు వేగాక పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో బెల్లం, కొంచెం నీళ్లు వేసి స్టవ్​ పై పెట్టి వేడి చేయాలి. బెల్లం పాకం వచ్చే వరకూ నీళ్లు మరిగించాలి. అప్పుడు నువ్వులు వేసి కలపాలి. చల్లారక ముందే చేతికి కొద్దిగా నూనె రాసుకుని ముద్దలుగా చుట్టాలి. ముద్దలు చల్లారి గట్టిపడతాయి. పండుగలకే కాదు నువ్వుల ముద్దలు చలికాలం కూడా తింటే మంచిది.

-వెలుగు,లైఫ్​–