మనం బయట కాలుష్యం నుండి తప్పించుకోవడానికి ఇంట్లోకి వెళ్తాం. ఇంట్లోకి వెళ్ళాక డోర్స్ మూసేస్తే సేఫ్ అని అనుకుంటాం. కానీ బయటి కాలుష్యం కంటే ఇంటి లోపల ఉండే గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరంగా మారుతోందని ప్రముఖ డాక్టర్స్ చెబుతున్నారు.
బయటి కాలుష్యం కంటికి కనిపిస్తుంది, కానీ ఇంట్లోని కాలుష్యం కనిపించదు. గాలి వెలుతురు సరిగా లేకపోవడం వల్ల హానికరమైన కణాలు గదిలోనే ఉండిపోతాయి. మనం రోజులో దాదాపు 8 నుండి 10 గంటలు ఇంట్లోనే నిద్రపోతాం. అంటే, మన ఊపిరితిత్తులు విశ్రాంతి లేకుండా గంటల తరబడి ఆ విష గాలిని పీలుస్తూనే ఉంటాయి.
దోమల కాయిల్:
చాలామంది దోమల నుండి రక్షణ కోసం మస్కిటో కాయిల్స్ వాడుతుంటారు. దీనిపై డాక్టర్స్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. మూసి ఉన్న గదిలో ఒక దోమల కాయిల్ వెలిగించడం అంటే, దాదాపు 100 సిగరెట్లు కాల్చడంతో సమానం. దీని నుండి వచ్చే సూక్ష్మ కణాలు రాత్రంతా మనం పీల్చడం వల్ల ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటాయి. దోమల నుండి తప్పించుకునేందుకు మనం మన ప్రాణాలనే పణంగా పెడుతున్నామని హెచ్చరిస్తున్నారు.
కేవలం కాయిల్స్ మాత్రమే కాదు, ఇంట్లో మనం వాడే మరికొన్ని కూడా గాలిని విషపూరితం చేస్తాయి. వంట చేస్తున్నప్పుడు వెలువడే వాయువులు, అగరుబత్తుల నుండి వచ్చే పొగ కూడా ఊపిరితిత్తులకు హానికరం. బయటి గాలి లోపలికి.. లోపలి గాలి బయటకు వెళ్లే మార్గం లేకపోతే కాలుష్య కారకాలు కేంద్రీకృతమై ఉంటాయి.
ఇంట్లో రెండు మూడు మొక్కలు పెంచితే గాలి ఫ్రెష్ అవుతుందని చాలామంది నమ్ముతారు. కానీ, గదిలోని కాలుష్యాన్ని మొక్కలు తగ్గించాలంటే ఆ గదిని ఒక అడవిలా మార్చాల్సి ఉంటుందని డాక్టర్స్ అంటున్నారు. కేవలం కొన్ని మొక్కల వల్ల గాలి నాణ్యతలో పెద్ద మార్పు రాదు.
దోమల కాయిల్ నుండి వచ్చే పొగ తేలికగా అనిపించవచ్చు, కానీ నష్టం తీవ్రంగా ఉంటుందని వివరించారు. ఈ సూక్ష్మ కణాలను గంటల తరబడి, ముఖ్యంగా రాత్రిపూట పీల్చుకుంటారు. ప్రజలు దోమల నుండి రక్షణగా వీటిని ఉపయోగిస్తారు, కానీ తెలియకుండానే ఊపిరితిత్తులను నాశనం చేస్తాయి అని అన్నారు.
