25 ఏండ్ల న్యాయ పోరాటం ఇప్పుడు నెగ్గింది

25 ఏండ్ల న్యాయ పోరాటం ఇప్పుడు నెగ్గింది
  • 25 ఏండ్ల న్యాయ పోరాటం ఇప్పుడు నెగ్గింది
  • ‘కల్యాణ్‌‌నగర్‌‌’ భూ ఆక్రమణ కేసులో సొసైటీకి పరిహారం ఇవ్వాలన్న హైకోర్టు 
  • ఆనాటి ఎమ్మెల్యే పీజేఆర్ ప్రోత్సాహంతోనే ప్లాట్లు ఆక్రమించారన్న బెంచ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ యూసఫ్ గూడలోని కల్యాణ్‌‌నగర్‌‌ భూ ఆక్రమణ వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. కల్యాణ్‌‌ నగర్‌‌ హౌసింగ్‌‌ సొసైటీ 25 ఏండ్లుగా చేస్తున్న న్యాయ పోరాటం ఫలించింది. సొసైటీ సభ్యులు కొనుగోలు చేసుకున్న భూమిని ప్లాట్లు చేశాక ఆనాటి ఎమ్మెల్యే పి.జనార్దన్‌‌ రెడ్డి ప్రోత్సాహంతో ఆక్రమణలు జరిగాయని చెప్పింది. భూములు సొసైటీవేనని భూ ఆక్రమణల నిరోధక కోర్టు 1989లో ఇచ్చిన తీర్పును అమలు చేసుంటే సొసైటీకి న్యాయం జరిగి ఉండేదని అభిప్రాయపడింది. ఇప్పుడు ఆ ఆక్రమణల తొలగింపు అసాధ్యమని తేల్చింది. సొసైటీకి 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించాలని ఉత్తర్వులిచ్చింది. 2 నెలల్లో పరిహారం చెల్లించాలంది. సొసైటీకి కోర్టు ఖర్చుల నిమిత్తం 8 వారాల్లో రూ.2 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌‌ ఎం.ఎస్‌‌.రామచంద్రరావు, జస్టిస్‌‌ వినోద్‌‌ కుమార్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ఇటీవల వందకుపైగా పేజీల తీర్పు వెలువరించింది. ఏపీ స్లమ్‌‌ ఇంప్రూవ్‌‌మెంట్‌‌ యాక్ట్‌‌ (భూసేకరణ చట్టం) 1956 కింద 1992 జూన్‌‌ 30న ప్రభుత్వం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌‌ను రద్దు చేసింది. 

అసలేం జరిగిందంటే..
మధ్యతరగతి కుటుంబాలు ఇండ్ల స్థలాల కోసం 1963 హౌసింగ్‌‌ కోపరేటివ్‌‌ సొసైటీ యాక్ట్‌‌ కింద యూసఫ్‌‌గూడలోని సర్వే 128/1, 128/10ల్లో 38 ఎకరాల 2,121 గజాల స్థలాన్ని 1964లో రాజ్యలక్ష్మి ఇతరుల నుంచి కొనుగోలు చేశారు. 287 ప్లాట్లు వేస్తే 1978లో మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ ఆమోదం ఇచ్చింది. ల్యాండ్‌‌ సీలింగ్‌‌ వివాదం కారణంగా సొసైటీ సభ్యులకు ప్లాట్ల కేటాయింపు కాలేదు. అప్పటికాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే జనార్దన్‌‌రెడ్డి ప్రోద్బలంతో 503 మంది స్థలాల్ని ఆక్రమించుకున్నారు. పీజేఆర్‌‌ సారథ్యంలో కార్మిక నగర్‌‌ వీకర్‌‌ సెక్షన్‌‌ సొసైటీ కింద రిజిస్ట్రేషన్‌‌ జరిగింది. దీనిని 1989లో ల్యాండ్‌‌ గ్రాబింగ్‌‌ కోర్టు తప్పుపడుతూ తీర్పునిచ్చింది. ఆ తీర్పు అమలు కాకుండా ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి చేసి, సొసైటీకి గజానికి రూ.25 చొప్పున ఇచ్చేలా సంఘంతో ప్రతిపాదన చేయించారు. ఆ ఒప్పందాన్నీ అమలు చేయలేదు. ఈలోగా భూసేకరణ చేస్తున్నట్లు ఆ నాటి సీఎం నోటిఫికేషన్లు ఇచ్చారు. దీంతో సొసైటీ హైకోర్టులో కేసు వేసింది.