హైదరాబాద్, వెలుగు: మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) కిషన్ నాయక్ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తును ఏసీబీ ముమ్మరం చేసింది. బినామీల పేర్లతో కూడబెట్టిన అవినీతి ఆస్తుల చిట్టా గుట్టువిప్పుతోంది. ఇందులో భాగంగా తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న మేనల్లుడు శివశంకర్ పేరున కిషన్ నాయక్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ విచారణలో వెలుగు చూసింది.
మంగళవారం కిషన్ నాయక్ ఇల్లు సహా 11 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాలు జరుగుతున్న విషయం కిషన్ నాయక్ ద్వారా తెలుసుకున్న మేనల్లుడు శివశంకర్ పారిపోయాడు. దీంతో అతని కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో కిషన్ నాయక్‌కు అభివృద్ధి కోసం ఇచ్చిన కమర్షియల్ బిల్డింగ్‌లో తన వాటాగా వచ్చిన 40% ఫ్లాట్లను ఇటీవల విక్రయించినట్టు ఏసీబీ గుర్తించింది. వీటి విలువ రూ.5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అధికారికంగా రూ.12.71 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించడం ఇదే తొలిసారి. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.250 కోట్ల వరకు ఉంటాయని అంచనా. కిషన్ నాయక్‌ను కస్టడీకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసి మరిన్ని వివరాలు సేకరించనున్నారు.
