
హైదరాబాద్, వెలుగు: మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించిన 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు బుధవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం అభ్యర్థులకు బోర్డు పలు సూచనలు చేసింది. నాన్ క్రీమీ లేయర్ పరిధిలోకి వచ్చే బీసీలు తప్పనిసరిగా సర్టిఫికెట్అప్లోడ్ చేయాలని, లేకుంటే వారిని ఓసీలుగానే లెక్కలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో అప్లై చేసేటోళ్లు సంబంధిత సర్టిఫికెట్ను రెవెన్యూ శాఖ నుంచి తీసుకొని అప్ లోడ్ చేయాలని పేర్కొంది.
ఉమ్మడి ఏపీలో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికెట్ చెల్లదని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లనే అప్లోడ్ చేయాలని బోర్డు సూచించింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది తాము పనిచేస్తున్న ఆస్పత్రులు, డీఎంహెచ్వోల నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ను తీసుకొని అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఫిబ్రవరి 15 దాకా అప్లికేషన్లకు చాన్స్ ఇచ్చింది. జీఎన్ఎం, బీఎస్సీ (నర్సింగ్) చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.