
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. శుక్రవారం ఉదయం 5.50 గంటల సమయంలో ఓ వ్యక్తి పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాడు. గోడ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) దళాలు గమనించి అతన్ని అదుపులోకి తీసుకున్నాయి.
అనంతరం విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన వ్యక్తి మానసిక స్థితి సరిగ్గా లేనట్లు కనిపిస్తున్నదన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. పార్లమెంట్ గోడకు ఆనుకొని ఉన్న చెట్టు ఎక్కి లోపలికి ప్రవేశించేందుకు అతను ప్రయత్నించాడని భద్రతా దళాలు వెల్లడించాయి.