నాతో, బండి సంజయ్‌తో ఈటల మాట్లాడారు

నాతో, బండి సంజయ్‌తో ఈటల మాట్లాడారు

హైదరాబాద్: మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరతారని పుకార్లు వస్తున్నాయి. ఈటల ఢిల్లీకి వెళ్లడంతో వీటికి మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. ఈ విషయంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తనతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌‌తోనూ ఈటల మాట్లాడారని.. తర్వాతే ఢిల్లీకి పయనమయ్యారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నియంత కేసీఆర్‌ను గద్దె దించడానికి అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. నియంతృత్వ పాలనను ఎదుర్కోవడానికే పార్టీని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. 

ఈటల నడ్డాను కలుస్తారు
‘ఈటల రాజేందర్ ఢిల్లీలో జేపీ నడ్డాను కలుస్తారు. అలాగే పార్టీ పెద్దలను కూడా కలిసి మాట్లాడతారు. ఈటల చేరికను ముఖ్యనేతలు సహా అందరూ స్వాగతిస్తున్నారు. పార్టీలో సానుకూల వాతావరణం ఉంది. బీజేపీ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు, నేతలు సహకరించాలి. అసంతృప్తులు సహజమే. సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తి గురించి పార్టీలో చర్చిస్తాం. అంతర్గత అంశాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దిరెడ్డి నన్ను విమర్శించినంత మాత్రాన నేను స్పందించాల్సిన‌ అవసరం లేదు. మంచి కేసీఆర్‌‌కు.. చెడు మోడీకి ఆపాదించడం టీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారింది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒక్క వెంటిలేటర్‌నూ కొనలేదు
‘తెలంగాణకు వెంటిలేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు అవసరమైన మేరకు అందించాం. పీఎం కేర్ నుంచి 1,400 వెంటిలేటర్లు అందించాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా కొనుగోలు చేయలేదు. భారత్ బయోటెక్, సీరం కంపెనీలకు అడ్వాన్స్‌‌లు చెల్లించాం. కేంద్ర ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ చట్టం ఉపయోగించి ఆక్సిజన్, వ్యాక్సిన్‌‌లను అన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. నేను ఓ ఎంపీగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో లక్షా 50 వేల కేజీల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నా’ అని కిషన్ రెడ్డి వివరించారు.