డేరింగ్ లేడీ కానిస్టేబుల్.. చంపేస్తామని బెదిరించినా.. నిజం, న్యాయం కోసం నిలబడిన రేవతి: దేశ వ్యాప్తంగా ప్రశంసలు

డేరింగ్ లేడీ కానిస్టేబుల్.. చంపేస్తామని బెదిరించినా.. నిజం, న్యాయం కోసం నిలబడిన రేవతి: దేశ వ్యాప్తంగా ప్రశంసలు

పోలీస్ డిపార్ట్ మెంట్.. అందులోనూ మహిళా కానిస్టేబుల్.. చిన్న స్థాయి ఉద్యోగం.. ఆ పోలీస్ స్టేషన్ మొత్తంలో ఏకైక మహిళా కానిస్టేబుల్.. సీఐ నుంచి మిగతా అందరూ మగ పోలీసులే. వాళ్లదే ఆధిపత్యం. వాళ్లు చెప్పిందే వేదం.. అలాంటి పోలీస్ స్టేషన్ లో జరిగిన దారుణమైన  రెండు హత్యల్లో నిర్భయంగా సాక్ష్యం  చెప్పిన డేరింగ్ లేడీ కానిస్టేబుల్ ఈ రేవతి. చంపేస్తామని బెదిరించారు.. ఫ్యామిలీని నామరూపాల్లేకుండా లేపేస్తామని వార్నింగ్స్.. ఉద్యోగం ఎలా చేస్తావో.. ఈ భూమిపై ఎలా బతుకుతావో చూస్తాం అంటూ హెచ్చరికలు.. అయినా నిజం వైపు నిలబడింది.. న్యాయం వైపు నడిచింది. తమిళనాడు రాష్ట్రం సాతుకుళం పోలీస్ స్టేషన్ లో ఇద్దరు వ్యక్తుల కస్డడీ డెత్ కేసులో.. తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష విధించిన కేసులో.. లేడీ కానిస్టేబుల్ రేవతి ఏ విధంగా సాక్ష్యం చెప్పింది.. ఏ విధంగా నిజం వైపు దైర్యంగా నిలబడింది అనేది కోర్టు తీర్పు ఆధారంగా ఇస్తున్న కథనం ఇది.. ఇప్పుడు ఈ లేడీ కానిస్టేబుల్ రేవతి దేశ వ్యాప్తంగా సంచలనంగా అయ్యారు.. ఆమె దైర్యానికి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాతంకుళం పోలీస్ స్టేషన్‌లో 2020లో జరిగిన తండ్రీకొడుకులు జయరాజ్, బెన్నిక్స్ లాకప్ డెత్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 5 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత.. ఈ కేసులో 9 మంది పోలీసులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పు వెనుక ఉన్న రియల్ హీరో ఒక సాధారణ మహిళా హెడ్ కానిస్టేబుల్ రేవతి. తోటి అధికారుల కిరాతకాన్ని కళ్లకు కట్టినట్లు బయట పెట్టేందుకు ప్రాణాలకు తెగించి ఆమె ఇచ్చిన సాక్ష్యం ఇప్పుడు పోలీసు వ్యవస్థలోని చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చింది.

ఆ రాత్రి ఏం జరిగింది?
కరోనా రూల్స్ అతిక్రమించి మొబైల్ షాపు తెరిచారన్న చిన్న కారణంతో జయరాజ్, ఆయన కుమారుడు బెన్నిక్స్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రి 8.50 గంటలకు రేవతి డ్యూటీకి వచ్చేసరికి స్టేషన్ లోపల కేకలు వినిపిస్తున్నాయి. "అమ్మా.. నొప్పిగా ఉంది, నన్ను వదిలేయండి.. తప్పు చేశాను" అంటూ బాధితుల ఆర్తనాదాలు స్టేషన్ బయటకు కూడా వినిపిస్తున్నాయని ఆ రాత్రి జరిగిన విషయాలను రేవతి మేజిస్ట్రేట్ ముందు వివరించారు. సబ్ ఇన్ స్పెక్టర్ బాలకృష్ణన్ సహా ఇతర పోలీసులు ఆ ఇద్దరినీ రక్తమోడేలా బాదినట్లు రేవతి చెప్పారు. దెబ్బలకు తాళలేక ఒళ్లంతా గాయాలై బాధితులు స్పృహ తప్పి పడిపోతే.. నేలపై చిందిన రక్తాన్ని కూడా వారితోనే తన సీనియర్ అధికారులు తుడిపించారని చెప్పారు రేవతి. 

రాక్షస ఆనందం.. బూట్లతో తొక్కి..
పోలీసులు ఆ రాత్రి తండ్రి కొడుకులను కేవలం కొట్టడమే కాకుండా.. రాక్షసానందం పొందారని రేవతి సాక్ష్యం వెల్లడించింది. మధ్యమధ్యలో మద్యం తాగుతూ.. బాధితుల ప్రైవేట్ భాగాలపై డ్యూటీలో ఉన్న పోలీసులు బూట్లతో తొక్కి చిత్రహింసలు పెట్టిన విషయం బయటపెట్టారు రేవతి. వారి బట్టలు విప్పించేసి చేతులు కట్టేయడం చూసి తట్టుకోలేక తాను గది బయటకు వచ్చేశానని రేవతి కన్నీళ్లతో చెప్పారు. కనీసం వారు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు తాను కాఫీ ఇవ్వబోతే.. ఇతర పోలీసులు దానిని విసిరికొట్టారని జరిగిందంతా చెప్పేశారు కానిస్టేబుల్ రేవతి.

►ALSO READ | మొదటి భార్య ఉండగా.. ముస్లిం వ్యక్తి రెండో పెళ్లి చేసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు

ప్రాణాలకు తెగించి.. ఒంటరి పోరాటం:
ఒక సామాన్య కానిస్టేబుల్ తన పై అధికారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం అంటే అది ఆత్మహత్యతో సమానం. స్టేషన్ చుట్టూ పోలీసులు చుట్టుముట్టి బెదిరిస్తున్నా.. తన ఇద్దరు ఆడపిల్లల భద్రత గురించి భయపడుతూనే రేవతి నిజం వైపు నిలబడ్డారు. మేజిస్ట్రేట్ భరతీదాసన్ విచారణకు వచ్చినప్పుడు.. "సార్.. నేను నిజం చెబుతాను, కానీ నా పిల్లలకు రక్షణ కల్పించగలరా?" అని ఆమె అడిగిన ప్రశ్న ఆనాటి భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న ప్రతి అధికారిని భయం లేకుండా గుర్తించి.. ఈ కేసులో నిందితులకు శిక్ష పడటంలో కీలక పాత్ర పోషించారు రేవతి.

ఈ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష పడటం అనేది భారత న్యాయచరిత్రలో ఒక మైలురాయి. యూనిఫాం వేసుకున్న వారు చట్టానికి అతీతులు కారని ఈ తీర్పు నిరూపించింది. తోటి పోలీసులు మౌనంగా ఉండమని హెచ్చరించినా.. బెదిరింపులకు పాల్పడినా వెనకడుగు వేయని రేవతి ధైర్యం ముందు ఆ రాక్షస పోలీసులు తలవంచాల్సి వచ్చింది. మద్రాస్ హైకోర్టు స్వయంగా ఆమెకు రక్షణ కల్పించి భరోసా ఇచ్చింది. మెుదట్లో తన పిల్లలు, భర్తకు ఆపద కలుగుతుందనే భయంతో వాస్తవాలను చెప్పినప్పటికీ తన వాగ్మూలంపై సంతకం చేసేందుకు ఆమె నిరాకరించారు. అయితే న్యాయస్థానం నుంచి రక్షణ కల్పిస్తామని వచ్చిన వాగ్ధానంతో చివరికి సంతకం చేశారు రేవతి. దీంతో కోర్టు వారి కుటుంబానికి ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లతో రేవతి ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అందించింది. అలా తన కళ్ల ముందే ఉన్నతాధికారులు చేసిన క్రూరమైన పనిని రేవతి ధైర్యంగా బయటపెట్టడంతో దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.