అసాంజే కేసులో అమెరికా విజ్ఞప్తికి యూకే అంగీకారం

అసాంజే కేసులో అమెరికా విజ్ఞప్తికి యూకే అంగీకారం

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించాలన్న నిర్ణయానికి బ్రిటన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాలకు సంబంధించిన కీలక పత్రాలను లీక్ చేసినట్టు వికీలీక్స్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆస్ట్రేలియన్ పౌరుడైన 50 ఏళ్ల అసాంజేను అమెరికాకు అప్పగించే క్రమంలో ముఖ్యమైన ఫైలుపై బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ సంతకం చేశారు. మిలిటరీకి చెందిన రహస్య దస్త్రాలను ప్రచురించిన ఆరోపణలపై జూలియన్ అసాంజేను విచారించాల్సి ఉందని, అందుకోసమే ఆయనను తమకు అప్పగించాలని అమెరికా రిక్వెస్ట్ చేసింది.

జూలియన్ అసాంజేను అమెరికాకు అప్పగించే వ్యవహారం కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టుల వరకు అనేక దశల్లో అప్పీలుకు వెళ్లింది. జూన్ 17న మేజిస్ట్రేట్ కోర్టుతో పాటు హైకోర్టు కూడా అసాంజే అప్పగింతపై ప్రభుత్వానికి అనుకూల తీర్పులు ఇచ్చాయని బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే.. ఈ కోర్టు తీర్పులపై అప్పీల్ చేసుకునేందుకు అసాంజేకు 14 రోజుల సమయం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అసాంజే బృందం మరోసారి అప్పీల్ చేసే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు.

బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ నిర్ణయం తీసుకోవడంపై జూలియన్ అసాంజే మద్దతుదారులు మండిపడుతున్నారు. ఇది పాత్రికేయ స్వేచ్ఛకు, యూకే ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అంటున్నారు. అంతేకాదు, ఈ ఆదేశాలను హైకోర్టులో అప్పీల్ చేస్తామని ప్రతిన బూనారు. జూలియన్ అసాంజే ఏ తప్పూ చేయలేదని వికిలీక్స్ సంస్థ వాదించింది. ఆయన ఏ నేరమూ చేయలేదని, నేరస్తుడు అసలే కాదని పేర్కొంది. అసాంజే ఒక పాత్రికేయుడని, ఒక ప్రచురణకర్త అని వివరించింది. అసాంజే కేవలం ఆయన వృత్తి నిర్వర్తించాడని తెలిపింది. అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడిందని నిరూపించే ఎవిడెన్స్‌ను జూలియన్ అసాంజే ప్రచురించాడని, అందుకే ఆయనపై దాఖలైన కేసు ఒక రాజకీయ కేసు అని పేర్కొంది.