
ఎల్బీనగర్, వెలుగు: భూ తగాదాలతో అన్నను తమ్ముడు చంపిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. హయత్నగర్ సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన ప్రకారం.. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం డాకుతండాకు చెందిన కరంటోతు లోక(54), రఘు (49), బుగ్గ(46) అన్నదమ్ములు. వీరు ఇరవై ఏండ్ల కింద హయత్నగర్ డివిజన్లోని బంజారా కాలనీ(అంబేద్కర్కాలనీ)కి వచ్చి ఉంటున్నారు.
డాకుతండాలో తల్లి పేరుతో ఎకరం 20 గుంటల భూమిపై అన్నదమ్ముల మధ్య కొన్ని రోజులుగా గొడవలు నెలకొన్నాయి. ఇటీవల లోక తన ఇద్దరు తమ్ముళ్లకు తెలియకుండా తన పేరుపై ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీంతో అన్నదమ్ముల మధ్య గొడవలు తలెత్తాయి. 20 గుంటల భూమిని తమ్ముడు బుగ్గ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు అన్న అంగీకరించాడు.
ఇది తెలిసిన మరో తమ్ముడు రఘు మంగళవారం అన్న ఇంటికి వెళ్లాడు. ఆయన లేకపోవడంతో బుగ్గ ఇంటికి వెళ్లాడు. మీరే భూమిని ఎలా పంచుకుంటారని నిలదీశాడు. దీంతో బుగ్గ, అతడి కొడుకు అనిల్ ఇద్దరు కలిసి రఘుపై దాడి చేశారు. అతడు కుప్పకూలిపడిపోగా స్థానికులు, బంధువులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.