- పోలీస్ స్టేషన్‌కు రాకుండానే ఎఫ్‌ఐఆర్ నమోదు
- వాట్సాప్‌కు ఏఐ ఆధారిత ఈ–ఎఫ్‌ఐఆర్
- హెల్ప్‌డెస్క్ ప్రారంభించిన సీపీ సజ్జనార్
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాల బారినపడుతున్న వారికి అండగా హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ సహా ఇతర సైబర్ క్రైమ్ నేరాల్లో డబ్బు కోల్పోయిన బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాకుండానే ఆన్‌లైన్ సేవలు పొందే అవకాశం కల్పించారు. ఈ మేరకు దేశంలోనే తొలిసారిగా సీ–మిత్ర (సైబర్ మిత్ర) పేరుతో హెల్ప్ డెస్క్ ప్రారంభించారు.
బషీర్‌బాగ్ సీసీఎస్ కాంప్లెక్స్‌లోని సైబర్ క్రైమ్ విభాగంలో ఏర్పాటు చేసిన సీ–మిత్ర హెల్ప్ డెస్క్‌ను శుక్రవారం సీపీ సజ్జనార్ ప్రారంభించారు. సిటీ క్రైమ్స్, సిట్ అడిషనల్ సీపీ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ డీసీపీ అర్వింద్ బాబుతో కలిసి వివరాలు వెల్లడించారు. బాధితులకు ఫోన్ చేసి ఫిర్యాదు తీసుకోవడం మొదలుకొని, ఎఫ్‌ఐఆర్ నమోదయ్యే వరకు అంతా ఇంటి నుంచే పూర్తవుతుందని తెలిపారు. సీ మిత్ర సేవలతో బాధితులకు ఊరట లభిస్తుందని పేర్కొన్నారు.
సీ–మిత్ర సేవలు, ఏఐ ఆధారిత ఎఫ్‌ఐఆర్ ఇలా..
సైబర్ మోసానికి గురైనప్పుడు బాధితులు 1930 నంబర్‌కు ఫోన్ చేసి గానీ, జాతీయ సైబర్ పోర్టల్‌లో గానీ ఫిర్యాదు చేస్తుంటారు. అయితే, ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. చాలామంది బాధితులకు ఫిర్యాదులో ఏం రాయాలి? ఏయే పత్రాలు జత చేయాలి? ఏ సెక్షన్లు వర్తిస్తాయి? అనే సందేహాలు ఉంటాయి. వీటికి సీ మిత్ర సమాధానాలు చెప్తున్నది. 1930 నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ‘సీ–మిత్ర’ బృందమే స్వయంగా బాధితులకు ఫోన్ చేస్తుంది.
వర్చువల్ పోలీసులు డిపార్ట్మెంట్ కేటాయించిన 040 –4189-3111 నంబర్‌తో లైన్‌లోకి వస్తారని చెప్తారు. ఫిర్యాదుకు సంబంధిందించిన ఐడీని చెప్పి వివరాలు సేకరిస్తారు. ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి బాధితులకు పంపిస్తారు. ఈ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాక 87126 సిరీస్‌తో ప్రారంభమయ్యే పోలీస్ నంబర్‌తో సంబంధిత అధికారులు ఈ ఎఫ్‌ఐఆర్‌ను వాట్సాప్ చేస్తారు.
పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించాలి
సీ మిత్ర నుంచి అందిన కంప్లైంట్ డ్రాఫ్ట్‌ను బాధితులు ప్రింట్ తీసుకోవాలి. సూచించిన ప్రాంతాల్లో సంతకం చేయాలి. సైబర్ మిత్ర హెల్ప్ డెస్క్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, కమిషనర్ ఆఫీస్, బషీర్‌బాగ్, హైదరాబాద్–500029 అనే అడ్రస్‌కు పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపించాలి. లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న డ్రాప్ బాక్స్‌లో వేయాలి. స్వయంగా సంబంధిత అధికారులకు అందజేయవచ్చు. ఆ ఫిర్యాదుల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసుకొని విచారణ ప్రారంభిస్తారు.
ఎఫ్ఐఆర్ రిజిస్టర్లో ఏఐ బేస్డ్ టెక్నాలజీ: సజ్జనార్
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న బాధితుల ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదులో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ వర్చువల్ సీ-మిత్ర హెల్ప్ డెస్క్ ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఫ్యూచర్లో డిజిటల్ సంతకం తీసుకునే ఆప్షన్ కూడా పరిశీలనలో ఉందని తెలిపారు. ‘సీ–మిత్ర’ విధానం ద్వారా ఇకపై రూ.3 లక్షల్లోపు ఉన్న కేసులను జీరో ఎఫ్‌ఐఆర్ చేసి, సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తామని తెలిపారు.
