నెలకు ప్రభుత్వ అప్పు.. రూ.5 వేల కోట్లు.. ఏప్రిల్, మేలో తీసుకున్నది రూ.9,300 కోట్లు

నెలకు ప్రభుత్వ అప్పు.. రూ.5 వేల కోట్లు.. ఏప్రిల్, మేలో తీసుకున్నది రూ.9,300 కోట్లు

నెలకు ప్రభుత్వ అప్పు.. రూ.5 వేల కోట్లు
ఏప్రిల్, మేలో తీసుకున్నది రూ.9,300 కోట్లు
కాగ్ రిపోర్ట్​లో వెల్లడి
వడ్డీ కింద కట్టింది రూ.3,205 కోట్లు
లిక్కర్, పెట్రోల్ ఆమ్దానీపైనే సర్కార్ నజర్
రెండు నెలల్లో రూ.9,500 కోట్ల ఆదాయం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా యావరేజ్​గా రూ.5వేల కోట్ల దాకా అప్పు తీసుకుంటున్నట్లు కాగ్ రిపోర్ట్​లో వెల్లడైంది. ఏప్రిల్, మే నెలల్లో మొత్తం రూ.9,300 కోట్ల అప్పు తీసుకున్నట్లు తేలింది. తీసుకున్న అప్పులకు రెండు నెలలకు గాను రూ.3,205 కోట్లు చెల్లించింది. ఈమేరకు కంట్రోలర్ అండ్ ఆడిటర్​ జనరల్ (కాగ్) శుక్రవారం రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆమ్దానీ పరంగా చూసుకుంటే లిక్కర్, పెట్రోల్ సేల్స్​పైనే ప్రభుత్వం గురిపెట్టినట్లు తెలుస్తున్నది. ఈ రెండింటి అమ్మకాలతో పాటు వేస్తున్న వ్యాట్​తో బాగానే రాబడి సమకూరుతున్నది.

రెండు నెలల్లో లిక్కర్, పెట్రోల్​పై రూ.9,500 కోట్ల ఆదాయం వచ్చినట్లు కాగ్ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో పెట్రోల్ రాబడి రూ.2వేల కోట్లు దాటింది. సమ్మర్​లో బీర్ల సేల్స్ మస్త్ పెరగడంతో ఎక్సైజ్ డ్యూటీస్ కింద వచ్చిన ఆదాయం కూడా రూ.2,683 కోట్లుగా ఉంది. వీటికి వ్యాట్ అదనం. ఇక భూముల అమ్మకంతో నాన్ ట్యాక్స్​ రెవెన్యూ, జీఎస్టీ, ఆర్బీఐ, ఇతర రుణ సంస్థల నుంచి తీసుకుంటున్న అప్పులతో ఖజానా నడుపుతున్నది. రాష్ట్రానికి ఏప్రిల్, మే నెలల్లో మొత్తం ఆదాయం రూ.31,699 కోట్లు రాగా, ఇందులో పన్నులతో వచ్చిన రాబడి రూ.20,097 కోట్లుగా ఉన్నది.

పన్ను ఆదాయంలో జీఎస్టీ ఆమ్దానీ రూ.7,430 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రూ.2,358 కోట్లు, కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా రూ.1,494 కోట్లుగా ఉంది. ఇతర ట్యాక్స్​ల కింద రూ.1,327 కోట్లు వస్తున్నాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రూ.891 కోట్లు వచ్చింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కంట్రిబ్యూషన్ కింద రూ.1,438 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఖర్చులు చూసుకుంటే.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లకు రూ.9,600 కోట్లు ఖర్చు చేశారు. ఇక సబ్సిడీ కింద రూ.1,923 కోట్లు, రెవెన్యూ అకౌంట్ కింద రూ.6,692 కోట్లు ఖర్చు అయింది. వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలకు ప్రభుత్వం రూ.6785 కోట్లు ఖర్చు చేసిందని కాగ్ రిపోర్ట్​లో వెల్లడైంది.