- అనుమతులు ఇవ్వకుండా రాష్ట్రంపై కేంద్రం అడుగడుగునా వివక్ష
- సుప్రీంకోర్టు తీర్పుతోనే కేంద్రానికి సమాధానం చెప్పేలా సర్కారు కసరత్తులు
- పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్‌లకు నవంబర్లోనే ఓకే చెప్పిన సుప్రీంకోర్టు
- దానిపై ఈ నెల 25న మరోసారి సుప్రీంలో వాదనలు
హైదరాబాద్, వెలుగు: పాలమూరు--–రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్రం అడుగడుగునా కక్షసాధింపులకు పాల్పడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ ప్రాజెక్టుకు బీజం పడినా.. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ పేరిట కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నది. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసినా.. లేఖలు రాసినా బుట్టదాఖలు చేస్తున్నది. అయితే, ఇటీవల మంత్రి ఉత్తమ్‌కు రాసిన లేఖలో మరోసారి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు తేలే వరకు ఎలాంటి అనుమతులు ఇచ్చేది లేదని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే కేంద్రం తీరుపై అసహనంతో ఉన్న రాష్ట్ర సర్కారు.. నిరుడు నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సహా మరికొన్ని ప్రాజెక్టులను సుప్రీంకోర్టు తీర్పుకు ముడిపెట్టి కేంద్రానికి దీటుగానే జవాబిచ్చేందుకు రెడీ అవుతున్నది. అందుకు అనుగుణంగా ఈ నెల 25న సుప్రీంకోర్టులో జరిగే వాదనల్లో తెలంగాణ ప్రాజెక్టులను చేర్చితే బాగుంటుందన్న యోచన చేస్తున్నట్టుగా తెలిసింది.
ఏంటీ సుప్రీంకోర్టు తీర్పు..
ప్రాజెక్టులు చేపట్టాక పర్యావరణ అనుమతులు, ఇతర అనుమతులు (పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సులు) తీసుకోవడంపై సుప్రీంకోర్టు నిరుడు మేలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రాజెక్టులు కట్టాక పర్మిషన్లు ఇవ్వొద్దంటూ వనశక్తి అనే స్వచ్చంద సంస్థ వేసిన పిటిషన్‌ను మేలో విచారించిన ఇద్దరు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం.. వనశక్తి సంస్థ వాదనలతో ఏకీభవించింది. ప్రాజెక్టులు మొదలుపెట్టాక అనుమతులు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తూ.. ఇప్పటికే ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. బెంచ్తీర్పుపై మరోసారి నవంబర్‌లో అప్పటి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారించింది.
అప్పటికే ఎన్నో వందల కోట్ల పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకపోవడం అంటే.. ప్రజాధనం దుర్వినియోగం అవ్వడమేనని, నష్టం కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతూ అనుమతులకు లైన్ క్లియర్ చేసింది. తాజాగా దానిపై సుప్రీంకోర్టు మరోసారి అన్ని పిటిషన్లను విచారించాలని నిర్ణయించింది. ఈ నెల 25న ఎలాంటి వాయిదాల్లేకుండా పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సులకు సంబంధించిన అంశాన్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారించనుంది.
తెలంగాణకు ఆది నుంచీ అన్యాయమే
రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అడుగడుగునా కేంద్రం నుంచి అన్యాయం, మొండి చెయ్యే ఎదురవుతున్నది. ఆ ప్రాజెక్టుకు ఏపీ అడ్డుపడుతూనే ఉన్నది. ఏపీ ప్రభుత్వం అండతో కేంద్రం కూడా పాలమూరు ప్రాజెక్టుపై వివక్ష చూపిస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వనశక్తి కేసులో భాగంగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు సీతారామ –సీతమ్మసాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ తదితర ప్రాజెక్టులకు పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్స్ కింద అనుమతులిచ్చేలా చూసేందుకు సుప్రీంకోర్టు వేదికగానే కేంద్రంపై పోరాడాలని భావిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితులు, అవసరాలను కోర్టుకు వివరించాలని యోచిస్తున్నది.
మన అవసరాలు, మన నీటి వాటాలు, మనకు దక్కాల్సిన హక్కులు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణకు మినహాయింపులు తెచ్చుకునేలా ప్రయత్నిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. రాష్ట్రం ఏర్పడడానికి ముందే చేపట్టిన ప్రాజెక్టులను.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత చేపట్టినవాటి జాబితాలో చూపిస్తుండడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు పోస్ట్ ఫ్యాక్టో క్లియరెన్సులకు అప్లై చేసుకునేందుకు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం.
