రాజీవ్ నిందితుల విడుదల  తీర్పును రివ్యూ చేయండి

రాజీవ్ నిందితుల విడుదల  తీర్పును రివ్యూ చేయండి

రాజీవ్ హంతకుల విడుదల తీర్పును రివ్యూ చేయండి

సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ 

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గురువారం సుప్రీంకోర్టులో కేంద్రం ఈ మేరకు రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. రాజీవ్ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను సుప్రీంకోర్టు వారం కిందట విడుదల చేయడంతో కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో తీర్పును రివ్యూ చేయాలని కేంద్రం కోరింది. ‘‘సరైన విచారణ లేకుండానే దోషులను విడుదల చేయడం న్యాయ సూత్రాలకు విరుద్ధం. వాస్తవానికి ఈ కేసులో అన్యాయమైన తీర్పు వచ్చింది” అని కేంద్రం తన పిటిషన్ లో తెలిపింది.

‘‘ఇది మాజీ ప్రధాని హత్యకు సంబంధించిన సెన్సిటివ్ అంశం. దేశంలో శాంతి భద్రతలపై, క్రిమినల్ జస్టిస్ సిస్టంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఇందులో కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కూడా చాలా ముఖ్యం. ఆరుగురు దోషుల్లో నలుగురు శ్రీలంకకు చెందిన వారు. టెర్రరిజం చార్జెస్ కింద దోషులుగా తేలారు. రాజీవ్​ను హత్య చేసిన వీరిని విడుదల చేయడం అంతర్జాతీయంగా ప్రభావం చూపుతుంది” అని కేంద్రం పేర్కొంది. కాగా, రాజీవ్ హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఏడుగురు దోషుల్లో ఏజీ పేరరివాళన్ ను గత మే నెలలోనే సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఈ తీర్పును మిగతా దోషులకు కూడా వర్తింపచేయాలని అభిప్రాయపడిన కోర్టు ఇటీవల నళినితోసహా మిగతా ఆరుగురు దోషులనూ విడుదల చేసింది.