పత్తి సాగులో కొత్త టెక్నాలజీ..

పత్తి సాగులో కొత్త టెక్నాలజీ..
  •     140 నుంచి 160 రోజుల్లోనే పంట చేతికి
  •     కూలీలను తగ్గించి.. మెషీన్ వర్క్​పెంచడం
  •     మొత్తం దూది ఒక్కసారే తీసే సైంటిఫిక్ పద్ధతులు
  •     పెట్టుబడి తగ్గించి, దిగుబడి పెంచడమే టార్గెట్
  •     పత్తి సాగుపై రాష్ట్రాలకు కేంద్రం కాన్సెప్ట్​పేపర్

హైదరాబాద్, వెలుగుపత్తి సాగులో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ఇతర దేశాలలో అమలవుతున్న టెక్నాలజీని వాడుకోవాలని భావిస్తోంది. తక్కువ రోజుల్లో పంట వచ్చే వెరైటీ విత్తనాలపై దృష్టి పెట్టినట్టు చెప్పింది. ఇప్పుడు పత్తి పంటకు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు పడ్తోంది. అయితే 140 రోజుల నుంచి 160 రోజుల్లోపే వచ్చే విత్తనం తీసుకువస్తున్నట్లు చెప్పింది. కాటన్​సాగులో మోడ్రనైజేషన్​పై వ్యవసాయ, టెక్స్​టైల్స్ డిపార్ట్​మెంట్స్ కాన్సెప్ట్ పేపర్ తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపాయి. వచ్చే రెండేళ్లలోనే దీన్ని అమలు చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. దున్నడం దగ్గర నుంచి దూది తీసే వరకు ఇప్పుడున్న విధానాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. విత్తనాలు, ఎరువులు వేసేందుకు, పత్తి తీసేందుకు ప్రతిదానికి లేబర్ కావాల్సిందే. అయితే వీటికి పరిష్కారంగా ట్రాక్టర్, ఇతర యంత్రాల సాయంతోనే సీడ్​ వేసుకునేలా ప్లాంటింగ్​ మేనేజ్మెంట్ తీసుకువస్తున్నట్లు పేర్కొంది. పత్తిని మెకానికల్ గా​ పికింగ్​ చేసేందుకు సైంటిఫిక్​పద్ధతులు పేర్కొంది. రెండు, మూడు సార్లు పత్తి ఏరడం కాకుండా ఒకేసారి కాయలు పగిలి, మెషిన్​తో దూది తీసే విధానాన్ని ప్రతిపాదించింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని, దిగుబడి, నాణ్యత బాగున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది రైతులు పత్తి సాగు చేస్తున్నరు. పత్తి పంటలో ఇప్పటికీ పాత పద్ధతులే ఉండడంతో కూలీల కొరత, పెట్టుబడి ఖర్చులు పెరగడం వంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ పరిస్థితులు మారాలంటే మోడర్న్ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలని కేంద్రం పేర్కొంది.

గులాబీ పురుగుకు చెక్​పెట్టేలా

రైతులు15 ఏళ్లుగా బీటీ పత్తి విత్తనాలు సాగు చేస్తున్నారు. ఎక్కువగా కమర్షియల్​బీటీ హైబ్రీడ్స్​ సాగు చేస్తున్నరు. ఆ విత్తనాల రెసిస్టెన్సీ కొంత తగ్గింది. అందుకే గులాబీ రంగు పురుగు తెగులు ఎక్కువై రైతులకు నష్టం వాటిల్లుతోంది. జీన్ ఎడిట్ చేసి మరింతగా తెగుళ్లను తట్టుకునే, దిగుబడులు ఎక్కువగా వచ్చే పత్తి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు  కేంద్రం పేర్కొంది. ఇతర దేశాలలో ఇప్పటికే సాగవుతున్న వాటిని పరిశీలిస్తున్నామని, బయో డైవర్సిటీ దెబ్బతినకుండా ఉండే సీడ్స్​కు త్వరలోనే అనుమతించే విషయమై కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలిపింది. అలాగే బీటీ విత్తనాలను లోకల్ వెరైటీలోకి మార్చే రీసెర్చ్​ జరుగుతోందని, వాటిని కూడా త్వరలోనే తీసుకువస్తమంది. తక్కువ కాలపరిమితి పంట వచ్చేలా వెరైటీలు, ఉన్న ఏరియాలోనే ఎక్కువ ప్లాంటింగ్​చేసుకునే విధానాలపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉందని పేర్కొంది. ఇప్పుడున్న వెరైటీలతో ఈ కాన్సెప్ట్​ పేపర్​ ప్రకారం దేశంలో 18 రాష్ట్రాల్లోని 287 జిల్లాల్లో పత్తి సాగవుతోంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒడిశాలో ఎక్కువగా ఈ పంట వేస్తున్నరు. ప్రపంచవ్యాప్తంగా పత్తి ఉత్పత్తిలో భారత్​వాటా 38 శాతం ఉంటుంది.