ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లకు ఫండ్స్‌‌

ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లకు ఫండ్స్‌‌
  • పీఎం జన్మన్ స్కీమ్‌‌లో రిలీజ్‌‌ చేయనున్న కేంద్ర ప్రభుత్వం
  • రోడ్ల విషయమై ఇటీవల కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మారుమూల ఆవాస గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలని మంత్రి సీతక్క చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తొలి విడతలో 28 ఆవాస గ్రామాలకు 66.97 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది. ఈ ఏడాది జూన్ 22న మంత్రి సీతక్క కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్‌‌తో సమావేశమై పీఎం జన్మన్ పథకం

ద్వారా మారుమూల గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో ఆయా రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మారుమూల ఆవాస గ్రామాలకు మరిన్ని రోడ్లను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు.

నిత్య విద్యార్థి మంత్రి సీతక్క..

సమీక్షలు, జిల్లా పర్యటనలు, అధికార కార్యక్రమాలు, సమావేశాలు, సభలు, అభివృద్ధి పనుల పరిశీలన, ప్రజా సేవ, సందర్శకుల సమస్యల పరిష్కారం, పార్టీ ప్రోగ్రాముల్లో బిజీబిజీగా ఉండే మంత్రి సీతక్క నిత్య విద్యార్థిగా నిలుస్తున్నారు. అధికార బాధ్యతలు నిర్వర్తిస్తూనే చదువుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రజా సేవలో ఉంటూ ఎల్ఎల్‌‌బీకి ప్రిపేర్ అవుతున్నారు. రాజనీతి శాస్త్రంలో పీహెచ్‌‌డీ పూర్తి చేసిన సీతక్క.. తాజాగా శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న ఎల్ఎల్ఎం రెండో సంవత్సర పరీక్షలకు హాజరవుతున్నారు.

తన అధికార నివాసమైన ప్రజా భవన్‌‌లో ఎల్ఎల్ఏం పుస్తకాలను చదువుతున్నారు. మరోవైపు, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణం కోసం తన సామాజిక బాధ్యతగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘‘డ్రగ్స్‌‌ను తరిమెద్దాం’’పాట పాడిన సీనియర్ జర్నలిస్ట్ కొండల్ గౌడ్‌‌ను సీతక్క అభినందించారు. శుక్రవారం సెక్రటేరియెట్‌‌లో సీతక్కను కొండల్ గౌడ్ కలిశారు. తమ వృత్తి ధర్మం కొనసాగిస్తూనే డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి తమ వంతు పాత్ర పోషించాలని ఆమె కోరారు.