
- 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిద్దాం
- బీసీసీఐకి కేంద్రం ప్రతిపాదన
న్యూఢిల్లీ: టీమిండియా, రెస్టాఫ్ వరల్డ్ జట్ల మధ్య ఆగస్టు 22వ తేదీన క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ మ్యాచ్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. ఇండియా టాప్ క్రికెటర్లతో పాటు ప్రపంచంలోని మేటి ఆటగాళ్లను ఇందులో ఆడించే ప్రయత్నం చేయాలని బీసీసీఐకి పంపిన ప్రతిపాదనలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇండియా ప్లేయర్లను ఆడించడంలో పెద్దగా ఇబ్బంది లేదు. శ్రీలంకలో ఆగస్టు 27వ తేదీ నుంచి జరిగే ఆసియా కప్‌నకు ముందు ప్లేయర్లంతా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండే చాన్సుంది. కానీ, వరల్డ్ టీమ్ కోసం కనీసం 13-–15 మంది ఇంటర్నేషనల్ క్రికెటర్లను అందుబాటులోకి తేవడమే కష్టం అవుతుందని బోర్డు భావిస్తోంది. ఈ నెల 22–26వ తేదీల్లో బర్మింగ్‌హామ్‌లో జరిగే ఐసీసీ వార్షిక కాన్ఫరెన్స్‌లో పాల్గొనే బీసీసీఐ పెద్దలు ఈ మ్యాచ్‌కు ప్లేయర్లను పంపించాలని వివిధ దేశాల బోర్డులను కోరే అవకాశం ఉంది. టీ20 ఫార్మాట్‌లో ఈ మ్యాచ్ నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం.