IND vs PAK Semi-Final: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్‌కు సంబంధించిన సెమీఫైనల్ వేదికపై ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముంబైలోని ప్రతిష్ఠాత్మక వాంఖడే స్టేడియంలో టీమిండియా సెమీఫైనల్ ఆడే అవకాశం ఉన్నప్పటికీ, ఒక ప్రత్యేక పరిస్థితిలో అది మారే అవకాశం ఉంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, భారత్ సూపర్-8 నుంచి అర్హత సాధించి సెమీస్ కి చేరితే, మార్చి 5వ తేదీన ముంబైలో జరిగే రెండో సెమీఫైనల్‌లో ఆడాల్సి ఉంటుంది. సూపర్-8 గ్రూపుల ఫలితాలు భారత్–పాకిస్థాన్ మధ్య సెమీఫైనల్‌కు దారితీస్తే, మ్యాచ్ వేదిక పూర్తిగా మారిపోతుంది.
సూపర్-8లో భారత్ మొదటి స్థానం, పాకిస్థాన్ సెకండ్ ప్లేస్ లో ఉంటే, ఈ రెండు జట్లు సెమీఫైనల్‌లో తలపడతాయి. దీంతో భారత్ వాంఖడేలో కాకుండా శ్రీలంకలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్‌ను మార్చి 4వ తేదీన ఆడాల్సి ఉంటుంది. ఇది భారతదేశంలో ముఖ్యమైన పండుగ అయిన హోలీ రోజున మ్యాచ్ జరగడం విశేషం. ఈ విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గతంలోనే క్లారిటీ ఇచ్చింది.
భారత్–పాకిస్థాన్ సెమీస్ జరిగితే, ఆ మ్యాచ్‌ను కొలంబోలో నిర్వహిస్తామని.. టీమిండియా ఇతర జట్టుతో సెమీఫైనల్ ఆడితే మాత్రం ముంబై వేదికగానే జరుగుతుందని ఐసీసీ తెలిపింది. అదే సమయంలో, పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరితే, మొదటి సెమీఫైనల్ వేదిక కూడా మారనుంది. తొలుత కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌గా నిర్ణయించిన వేదికను మార్చి, ఆ మ్యాచ్‌ను కూడా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంకు తరలించారు.
►ALSO READ | పాక్–కివీస్ మ్యాచ్ వర్షార్పణం కావడం వల్ల.. కీలకంగా మారిన రాబోయే రెండు మ్యాచ్‌లు
ఇండియా– పాకిస్థాన్ మధ్య అమలులో ఉన్న హైబ్రిడ్ మోడల్ ఒప్పందంతో, ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికలలోనే నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం 2027 వరకూ అమల్లో ఉంటుంది. అందుకే భారత్, పాకిస్థాన్‌తో సెమీఫైనల్ ఆడాలంటే తప్పనిసరిగా శ్రీలంకకు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే, టోర్నీకి సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంక, ఒకవేళ సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే మాత్రం భారత్‌కు వచ్చి మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కాబట్టి, సూపర్-8 ఫలితాలపై ఆధారపడి భారత్‌కు సెమీఫైనల్ వేదిక మారే ఛాన్స్ ఉండటంతో, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
