- ఇద్దరు అధికారులతో ఏర్పాటు చేసిన కేంద్రం
- వివాదం, టెండర్ల రద్దు, ఇతర అంశాలపై విచారణ
- మూడ్రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ, హైదరాబాద్, వెలుగు: సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో నైనీ బొగ్గు గనుల టెండర్ల రద్దుపై విచారణకు ఇద్దరు అధికారులతో టెక్నికల్ కమిటీని వేసింది. ఇందులో బొగ్గు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్(డీడీజీ) చేతన శుక్లా, డైరెక్టర్ (టీ/ఎన్ఏ) మారపల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు. మూడు రోజుల్లో నివేదిక అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బొగ్గు గనుల శాఖ అండర్ సెక్రటరీ ప్రదీప్ రాజ్ నయన్ తాజాగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్ సీసీఎల్) సీఎండీ కృష్ణ భాస్కర్‌కు లేఖ రాశారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దుకు గల కారణాలపై విచారణ జరపనున్నట్లు అందులో పేర్కొన్నారు. నైనీ కోల్ బ్లాక్ మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్(ఎండీఓ) నియామకానికి సంబంధించి గతేడాది నవంబర్ 28న వెలువడిన టెండర్ల ఆహ్వాన నోటీస్(ఎన్ ఐటీ) విశ్లేషించనున్నట్లు తెలిపారు.
అలాగే తవ్వకాలకు సంబంధించి ఎండీఓలు, ఔట్ సోర్సింగ్ పనుల కోసం ఎన్ ఐటీ తయారీలో ఇతర బొగ్గు కంపెనీలు అనుసరిస్తోన్న విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. కాగా... తక్షణమే ఈ అధికారుల టెక్నికల్ బృందం సింగరేణి కార్యాలయాన్ని సందర్శించి విచారణ జరిపి మూడు రోజుల్లో తన సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లు స్పష్టం చేశారు.
కేంద్రం ఆరా తీసిన 24 గంటల్లోనే కమిటీ..
నైనీ కోల్బ్లాక్టెండర్ల స్వీకరణలో తలెత్తిన లోపాలపై సింగరేణి సంస్థను కేంద్ర బొగ్గుశాఖ ఆరా తీసిన 24 గంటల్లోనే విచారణ కమిటీ వేయడం గమనార్హం. బుధవారం ఢిల్లీలోని కేంద్ర బొగ్గు శాఖ జాయింట్ సెక్రటేరీ కె. సంజీవ్ కుమార్ నైనీ బొగ్గు గని టెండర్లపై అత్యవసర సమీక్ష జరిపారు. సింగరేణి సంస్థ తీసుకున్న నిర్ణయాలకు పాలకమండలి ఆమోదం తప్పనిసరి. ఈ బోర్డుకు కృష్ణభాస్కర్ చైర్మన్ కాగా, కేంద్ర బొగ్గుశాఖ జేఎస్, రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సింగరేణి డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. టెండర్ల ప్రక్రియలో సంస్థ విధించిన నిబంధనలపై పాలకమండలి ముందే ఎందుకు చర్చించలేదని సంజీవకుమార్ ప్రశ్నించగా, టెండర్ల స్వీకరణ ఇంకా ప్రారంభం కానందున తిరస్కరించామని రాష్ట్ర అధికారులు చెప్పినట్లు తెలిసింది.
సైట్ విజిట్ సర్టిఫికెట్ఇవ్వడానికి ఇంకా సమయం ఉన్నా ఇవ్వడం లేదని, ఆరోపణలు రావడంతోనే టెండర్ నోటిఫికేషన్ రద్దు నిర్ణయం తీసుకున్నామన్నట్లు సమాచారం. భవిష్యత్తులో పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించాలని జేఎస్ సూచించడంతో ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందని అంతా భావించారు. కానీ గురువారం కేంద్రం విచారణ కమిటీ వేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా కేంద్రం సీరియస్‌గా ఉండడంతో సింగరేణి సీఎండీ కృష్ణ భాస్కర్ రెండు రోజులుగా హైదరాబాద్‌లోని సింగరేణి కార్యాలయంలో అంతర్గత విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే విచారణ కమిటీకి అన్ని వివరాలు అందించేందుకు వీలుగా నైనీ బొగ్గు గని టెండర్లకు సంబంధించిన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
