
- ఇకపై లైసెన్సులు, అనుమతులు, రిజిస్ట్రేషన్లన్నీ అందులోనే
- ప్రారంభించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియాలో భాగంగా బ్రాడ్‌కాస్టింగ్ బిజినెస్‌నూ మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇకపై మీడియా చానళ్ల లైసెన్సులు, అనుమతులు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎలాంటి శ్రమ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ‘బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్’ను తీసుకొచ్చింది. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆ పోర్టల్‌ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. బ్రాడ్‌కాస్టింగ్ వ్యవస్థలో మరింత పారదర్శకత, బాధ్యతను పెంచేందుకు వీలుగా టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నామన్నారు. ‘బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్’ ద్వారా అతి తక్కువ టైంలోనే అప్లికేషన్ పెట్టుకుని అనుమతులు పొందేందుకు వీలుంటుందన్నారు. అంతేకాకుండా దరఖాస్తుపై అనుమతుల ప్రక్రియ ఎంతవరకొచ్చిందో అప్లికెంట్లు తెలుసుకోవచ్చన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సిద్ధాంతమైన ‘మినిమమ్ గవర్నమెంట్ మ్యాగ్జిమమ్ గవర్నెన్స్’కు ఈ పోర్టల్ ముందడుగని చెప్పారు. దీని ద్వారా 900 శాటిలైట్ టీవీ చానళ్లు, 70 టెలీపోర్ట్ ఆపరేటర్లు, 1,700 మల్టీ సర్వీస్ ఆపరేటర్లు, 350 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు, 380 ప్రైవేట్ ఎఫ్ఎం చానళ్లకు లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. పోర్టల్‌పై చేసిన టెస్ట్ రన్ విజయవంతమైందని, అందరి నుంచి మంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. త్వరలోనే నేషనల్ సింగిల్ విండో సిస్టమ్‌కు ‘బ్రాడ్ కాస్ట్ సేవా పోర్టల్’ను అనుసంధానిస్తామని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
పోర్టల్‌తో ఇవీ లాభాలు
- అప్లికేషన్లపై ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్
- పేమెంట్ వ్యవస్థలతో అనుసంధానం (భారత్ కోష్ )
- ఈ–ఆఫీస్, భాగస్వామ్య శాఖలతో అనుసంధానం
- అనలిటిక్స్, రిపోర్టింగ్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్
- ఇంటిగ్రేటెడ్ హెల్ప్ డెస్క్
- అప్లికేషన్ ఫారాలు.. దరఖాస్తు స్టేటస్ ట్రాకింగ్
- పోర్టల్ నుంచే అనుమతులు, లైసెన్స్, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన లెటర్లు, ఆర్డర్ల డౌన్లోడింగ్
- మెసేజ్, మెయిల్ ద్వారా భాగస్వాములకు అలర్ట్‌లు.