పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు‑2019 బిల్లు ఉపసంహరణ

పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు‑2019 బిల్లు ఉపసంహరణ
  • కొత్త చట్టాన్ని తీసుకొస్తమన్న ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్​
  • యాంటీ డోపింగ్ బిల్లు పాస్
  • ఈడీ దాడులపై సోనియా సహా అపొజిషన్ ఎంపీల నిరసనలు  
  • ప్రతిపక్ష ఎంపీల నోటీసులను తిరస్కరించిన చైర్మన్​

పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు‑2019ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. బిల్లును ఉపసంహ రించుకునేందుకు బుధవారం లోక్ సభలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తీర్మానం ప్రవేశపెట్టారు.

న్యూఢిల్లీ:  దేశంలోని ప్రజల డేటా రక్షణ కోసం తీసుకొచ్చిన పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, 2019ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. బిల్లును ఉపసంహరించుకునేందుకు బుధవారం లోక్ సభలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని సభ వాయిస్ ఓట్​తో ఆమోదించిన తర్వాత కేంద్రం బిల్లును వాపస్ తీసుకుంది. సమగ్రమైన లీగల్ ఫ్రేంవర్క్ తో కొత్త చట్టాన్ని రూపొందించి, బిల్లును ప్రవేశపెడ్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చెప్పారు. డేటా ప్రొటెక్షన్ బిల్లును కేంద్రం 2019లో లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత జాయింట్ పార్లమెంట్ కమిటీ పరీశీలనకు పంపారు. బిల్లును స్టడీ చేసిన కమిటీ.. 81 సవరణలను, 12 రెకమండేషన్లను సూచించింది. దీంతో బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది.

దేశం ఓడింది.. కంపెనీలు గెలిచాయ్: తివారీ  
డేటా ప్రొటెక్షన్ బిల్లును పెద్ద పెద్ద టెక్​ కంపెనీలు వ్యతిరేకించాయి. ముసాయిదా చట్టంలోని అనేక నిబంధనలను తొలగించాలంటూ లాబీయింగ్ చేశాయి. తాజాగా బిల్లును ఉపసంహరించుకోవడంతో దేశం ఓడిపోయిందని.. కంపెనీలే గెలిచాయంటూ కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ ట్వీట్ చేశారు. ‘‘బిల్లును మెరుగుపర్చేందుకు వివిధ పార్టీల ఎంపీలతో కూడిన కమిటీ రెండేండ్ల పాటు ఎంతో కృషి చేసింది. కానీ టెక్ కంపెనీలు ఈ బిల్లు రాకూడదని కోరుకున్నాయి. తాజా నిర్ణయంతో దేశం ఓడింది. టెక్ కంపెనీలే గెలిచాయి” అని ఆయన విమర్శలు గుప్పించారు.

యాంటీ డోపింగ్ బిల్లుకు ఆమోదం 
నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబోరేటరీల పనితీరు, విధివిధానాలకు సంబంధించిన చట్టపరమైన రూల్స్ కోసం తెచ్చిన నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లు–2022కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. బుధవారం రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అయింది. 

ఈడీ దాడులపై ఎంపీల ఆందోళనలు  
ఇటీవల వరసగా జరుగుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులపై పార్లమెంట్​లో బుధవారం ప్రతిపక్షాల సభ్యులు ఆందోళనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని నినాదాలు చేశారు. లోక్​సభలో సోనియాగాంధీ ఆధ్వర్యంలో ఎంపీలు వెల్​లోకి వచ్చి నిరసనలు తెలిపారు. డీఎంకే, ఎన్సీపీ, టీఎంసీ ఎంపీలు జతకలిశారు. ‘ఈడీ, మోడీ డౌన్ డౌన్’ అంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్యే కేంద్రం ఎనర్జీ కన్జర్వేషన్ (సవరణ) బిల్లు–2022ను ప్రవేశపెట్టింది. తర్వాత సభను స్పీకర్ 4 గంటలకు వాయిదా వేశారు. ఈడీ దుర్వినియోగంపై చర్చ చేపట్టాలంటూ ఉదయం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పలువురు ఎంపీలు ఇచ్చిన నోటీసులను చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు.


బిల్లులో ఏముంది?  
ప్రైవసీ హక్కు రాజ్యాంగం పరిధిలోని ఫండమెంటల్ రైట్ కిందకే వస్తుందని సుప్రీంకోర్టు 2017లో తీర్పునిచ్చింది. దేశంలో డేటా రక్షణ కోసం ప్రత్యేక ఫ్రేంవర్క్ ను రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశా ల మేరకు పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును రూపొందించిన కేంద్రం 2019, డిసెంబర్ 11న లోక్ సభలో ప్రవేశపెట్టింది. ప్రజల డేటాను ఎలా ప్రాసెస్ చేయాలి? ఎలా స్టోర్ చేయా లి? ప్రజలకు వారి డేటా విషయంలో ఉన్న హక్కులు వంటి అంశాలను బిల్లులో పొందుపర్చారు. ఈ బిల్లు డేటాను పర్సనల్ డేటా, సెన్సిటివ్, క్రిటికల్ పర్సనల్ డేటాలుగా డివైడ్ చేసింది. దేశీయ, ఫారిన్ కంపెనీలు.. ప్రజల పర్సనల్ డేటాను వాడుకునే ముందు వారి అనుమతి తీస్కోవాలని, సెన్సిటివ్ డేటాను ఇండియాలోనే దాచాలని, క్రిటికల్ డేటాను దేశం బయటకు ట్రాన్స్​ఫర్ చేయరాదని నిబంధనలను పొందుపర్చింది.