
దేశం మొత్తం దీపావళి సందడి నెలకొంది. లాంగ్ వీకెండ్ రావడంతో పండగ ఎంజాయ్ చేసేందుకు సిటీల నుంచి సొంతూళ్లకు వెళుతున్నారు జనం. అయితే ఆ ఊళ్ళో మాత్రం దీపావళి పండగ జరుపుకోరంట.. ఈ ఏడాదే కాదు కొన్ని శతాబ్దాల నుంచి ఆ ఊళ్ళో దీపావళి జరుపుకోవడం లేదంట. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది.. పండగ జరుపుకోకపోవడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..హిమాచల్ ప్రదేశ్ హమీర్ పూర్ జిల్లాలో సమ్మూ అనే గ్రామం కథ ఇది. సతి శాపం కారణంగా శతాబ్దాల కాలంగా ఆ ఊళ్ళో దీపావళి చేసుకోవడం లేదంట.
ఒక మహిళ తన భర్త చితిపై ఆత్మహత్య చేసుకుని, దీపావళి పండగ జరుపుకోకుండా శాపం పెట్టిందట.. అప్పటి నుంచి స్థానికులు ఉద్దేశపూర్వకంగా దీపాల పండుగ రోజున చీకట్లో ఉంటారని తెలుస్తోంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో దీపావళి రోజున టపాసులు పేల్చి సంబరాలు జరుపుకోవడంపై నిషేధం ఉంది.
గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఒక గర్భిణీ స్త్రీ దీపావళికి సిద్ధమవుతుండగా, స్థానిక రాజు సైన్యంలో సైనికుడిగా ఉన్న ఆమె భర్త మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. నిరాశ చెందిన ఆ మహిళ భర్త చితి మంటలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త చితి మంటలోకి దూకే ముందు... గ్రామంలో ప్రజలు ఎప్పటికీ దీపావళి జరుపుకోకూడదని శాపం విధించిందని చెబుతున్నారు గ్రామస్థులు.
►ALSO READ | రైలు ప్రయాణికులకు దీపావళి గిఫ్ట్: కేరళ నుండి రామేశ్వరానికి స్పెషల్ రైలు ప్రారంభించన రైల్వే..
ఆ గ్రామంలోని ప్రజలు దీపావళి జరుపుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా, ఎవరైనా చనిపోవడం, గ్రామంలో ఏదైనా విపత్తు సంభవించడం జరుగుతోందని తెలిపారు గ్రామస్థులు. కొన్ని ఆచారాల ద్వారా శాప విముక్తి కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదని అంటున్నారు గ్రామస్థులు.
మూడేళ్ళ కిందట గ్రామంలో ఒక పెద్ద యజ్ఞం చేశారని.. అయినా శాపవిముక్తి కలగలేదని అంటున్నారు. శతాబ్దాలు గడుస్తున్నా శాపం యొక్క ప్రభావం ఉన్న క్రమంలో చాలా మంది దీపావళి రోజున ఇళ్లను వదిలి బయటకు వెళుతున్నారని అంటున్నారు గ్రామస్థులు.