- సభలో గొడవపై కాంగ్రెస్ విచారం.. సజావుగా నడిచేందుకు అన్ని పార్టీల హామీ
న్యూఢిల్లీ, వెలుగు: బహిష్కరణకు గురైన ఎనిమిది మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై సస్పెన్షన్‌ను లోక్‌సభ రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోమవారం సభలో ప్రవేశపెట్టారు. ఈ అంశంపై అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటించారు.
తూర్పు లఢఖ్‌లో చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చించాలని మొదటి విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 4న ప్రతిపక్షం పట్టుబట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం, వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గుర్జీత్ సింగ్ ఔజ్లా, హిబీ ఈడెన్, డీన్ కురియాకోస్, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, బి.మాణిక్కం తాగోర్, డాక్టర్ ప్రశాంత్ పడోలే, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సీపీఐ(ఎం) పార్టీకి చెందిన ఎస్.వెంకటేశన్ కాగితాలు చింపి స్పీకర్ వైపు విసిరారు. దీంతో ఈ 8 మందిని బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెండ్ చేశారు.
సభ గౌరవం కాపాడాలని ఫ్లోర్ లీడర్ల సమావేశంలో అన్ని పార్టీలు పేర్కొన్నాయి. సభ్యులు కాగితాలు చింపి విసరవద్దని, టేబుల్స్ పైకి ఎక్కకూడదని నిర్ణయించారు. పార్లమెంట్ ప్రాంగణంలో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించకూడదని స్పీకర్ బిర్లా హెచ్చరించారు. సస్పెన్షన్ రద్దు నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్వాగతించారు. ఎంపీ ప్రశాంత్ పడోలే మాట్లాడుతూ ‘సత్యం జయించింది’ అని అన్నారు. దాదాపు ఆరు వారాల తర్వాత ఈ ఎంపీలు మళ్లీ సభలో పాల్గొనే అవకాశం వచ్చింది.
