రీల్స్ చేస్తుండగా.. పిస్టల్ పేలి యువకుడు మృతి.. ఢిల్లీలోని దల్లుపురాలో ఘటన

రీల్స్ చేస్తుండగా.. పిస్టల్ పేలి యువకుడు మృతి.. ఢిల్లీలోని దల్లుపురాలో ఘటన

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో వ్యూస్ కోసం యువత చేస్తున్న ప్రయత్నాలు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-3 పరిధిలోని దల్లుపురా గ్రామంలో మంగళవారం విషాదం జరిగింది. ఇన్‌‌స్టాగ్రామ్ రీల్ కోసం వీడియో తీస్తుండగా పొరపాటున పిస్టల్​ ట్రిగ్గర్ నొక్కడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. దల్లుపురా గ్రామానికి చెందిన పవన్ కుమార్(28) ఒక ప్రాపర్టీ డీలర్‌‌గా పని చేసేవాడు.

ఇన్‌‌స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీలో మ్యాగజైన్ పెట్టి, దానిని లోడ్ చేస్తూ కనిపించాడు. ఆ సమయంలో కెమెరా వెనుక ఉన్న అతడి బంధువు హిమాన్షు, తుపాకీని ఎలా పట్టుకోవాలో చెబుతూ పొరపాటున కూడా కాల్చొద్దని పవన్‌‌ను  హెచ్చరించాడు. అయితే, పవన్ తుపాకీని తన ఛాతిపై పెట్టుకొని కెమెరా వైపు చూస్తూ మరిచిపోయి ట్రిగ్గర్ నొక్కాడు. క్షణాల్లో బుల్లెట్ గుండెలోకి దూసుకుపోవడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

స్పృహ కోల్పోయిన పవన్‌‌ను వెంటనే వసుంధర ఎన్‌‌క్లేవ్‌‌లోని ధర్మశిల ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అశోక్ నగర్ పోలీసులు, ఫోరెన్సిక్ బృందంతో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తుపాకీతోపాటు 10 తూటాలు, మొబైల్ ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. పవన్ ఉపయోగించిన తుపాకీ అతడి బంధువు హిమాన్ష్​కు చెందిన లైసెన్స్డ్ ఆయుధంగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.