ఖలిస్థానీ ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు ఎన్ఐఏ సిద్ధం!

ఖలిస్థానీ ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు ఎన్ఐఏ సిద్ధం!

కెనడాలోని భారత వ్యతిరేక శక్తులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు ప్రారంభించింది. ఇటీవల భారతీయులను బెదిరించిన సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (SFJ) నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూకు పంజాబ్‌లో ఉన్న ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) జప్తు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్‌ఐఏ.. వివిధ దేశాల్లో నివసిస్తోన్న మరో 19 మంది ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

వివిధ దేశాల్లో ఉంటూ భారత్‌లో వేర్పాటువాదంపై ఖలిస్థాన్‌ సానుభూతిపరులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. బ్రిటన్‌, అమెరికా, కెనడా, దుబాయ్‌, పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాల్లో ఉంటున్న వీరిని.. భారత్‌ ఇప్పటికే ఉగ్రవాదులుగా గుర్తించింది. విదేశీ గడ్డపై ఉంటూ భారత్‌ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వీరి కార్యకలాపాలు, స్థానికంగా ఆస్తులపై ఎన్‌ఐఏ ఫోకస్ పెట్టింది. దాదాపు 20 మంది ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్ఐఏ సిద్ధమైనట్లు సమాచారం.

ఖలిస్థాన్‌ వేర్పాటువాదంతోపాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 43 మంది మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ జాబితాను ఎన్‌ఐఏ ఇటీవలే విడుదల చేసింది. వీరికి సంబంధించిన ఆస్తుల వివరాలు తెలియజేయాలని ప్రజలకు సూచించింది. వీరి ఫొటోలను కూడా విడుదల చేసింది. ఈ లిస్టులో ఉన్న ఖలిస్థాని సానుభూతిపరులు ఎక్కువగా కెనడాలోనే నివసిస్తున్నట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది.