
- అటవీ సంపదను కార్పొరేట్ లకు దోచిపెట్టడానికే ఆపరేషన్ కగార్
కాశీబుగ్గ, వెలుగు: దేశంలో బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అటవీ సంపదను కార్పొరేట్సంస్థలకు దోచిపెట్టడానికే ఆపరేషన్కగార్చేపట్టిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. మంగళవారం ఖిలా వరంగల్ మండల సీపీఐ మహాసభ వరంగల్ కోటలో ఓర్సు రాజు, తాళ్లపల్లి జాన్ పాల్ అధ్యక్షతన జరిగింది.
ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ పాలనలో ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ ను పరుస్తూ రూ. లక్షల కోట్లలో రాయితీలు ఇస్తూ ప్రజా సంక్షేమం మరిచిపోయి, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
రచయితలు, కవులు, కళాకారులు, విద్యావేత్తలను అణిచివేస్తూ, జాతీయవాదం పేరుతో హిందుత్వ ఎజెండాతో ముస్లిం, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఈ మహాసభలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్ కే బాషామియా తదితరులు పాల్గొన్నారు.