గ్రామ పంచాయతీలకు భారీ గుడ్ న్యూస్.. త్వరలోనే రూ.2,500 కోట్ల నిధులు

గ్రామ పంచాయతీలకు భారీ గుడ్ న్యూస్.. త్వరలోనే రూ.2,500 కోట్ల నిధులు
  •     తొలి విడతగా రూ.260 కోట్లు ఇవ్వనున్న కేంద్రం: కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  •     ప్రతి పంచాయతీ బ్యాంకు ఖాతా తెరవాలి 
  •     పదేండ్లలో తెలంగాణకు రూ.11 వేల కోట్లు ఇచ్చామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగియడం, పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న యూటిలైజేషన్ సర్టిఫికెట్ల (యూసీ)ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైందని చెప్పారు. 

2023–-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధుల ఖర్చుపై యూసీలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సమర్పించిందన్నారు. దీంతో 2024-– 25 ఏడాది సంబంధించి మొదటి విడత కింద రూ.260 కోట్లను కేంద్రం త్వరలో విడుదల చేయనుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులకు సంబంధించిన యూసీలు అందిన వెంటనే మిగిలిన రూ.2,500 కోట్లను కూడా దశలవారీగా విడుదల చేస్తామని చెప్పారు. గత పదేండ్లలో మోదీ ప్రభుత్వం తెలంగాణ స్థానిక సంస్థలకు రూ.11 వేల కోట్లకు పైగా నిధులు అందించిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 

కేంద్ర నిబంధనల ప్రకారం.. నిధుల వినియోగం కోసం ప్రతి పంచాయతీ తప్పనిసరిగా ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరవాలని, ఆ ఖాతాను పీఎఫ్ఎంఎస్ పోర్టల్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేసి, యూనిక్ ఏజెన్సీ కోడ్ పొందాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీల అకౌంట్లను జప్తు చేసి, నిధులను ఇతర అవసరాలకు దారి మళ్లించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. దీంతో సర్పంచులు అప్పులపాలై రాజీనామాలు చేశారని, కొందరు ప్రాణాలు కూడా తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. కేంద్రం చేసే అభివృద్ధి ప్రయత్నాలకు సహకరిస్తూ పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు చొరవ చూపాలని సూచించారు. 

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు.. 

మన సంస్కృతి, సంప్రదాయాలకు, రైతు కష్టానికి ప్రతీక సంక్రాంతి పండుగ అని కిషన్ రెడ్డి అన్నారు. తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ శుభ పర్వదినం ఐకమత్యానికి, కృతజ్ఞతా భావానికి నిదర్శనమని పేర్కొన్నారు. కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన వేళ.. ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవడం మన సంప్రదాయమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన వ్యవసాయ రంగానికి ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన గుర్తుచేశారు.