స్లమ్స్ అభివృద్ధి చెందితేనే నగరం ​డెవలప్​ అయినట్లు: కిషన్​రెడ్డి

స్లమ్స్ అభివృద్ధి చెందితేనే నగరం ​డెవలప్​ అయినట్లు: కిషన్​రెడ్డి
  • మూడు నెలలుగా పీహెచ్​సీలో కరెంట్ లేకుంటే ఎట్ల?
  • మెడికల్ ఆఫీసర్లపై కేంద్రమంత్రి ఆగ్రహం

మెహిదీపట్నం/పద్మారావునగర్, వెలుగు: మాదాపూర్, హైటెక్ సిటీ అభివృద్ధి చెందితే హైదరాబాద్ సిటీ అంతా అభివృద్ధి చెందినట్లేనా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన శుక్రవారం గుడిమల్కాపూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి మాట్లాడారు. మాదాపూర్, హైటెక్ సిటీలను చూపెట్టి నగరం మొత్తం అభివృద్ధి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవడం పద్ధతి కాదన్నారు. పేదలు నివసించే మురికివాడల(స్లమ్స్)​ను అభివృద్ధి చేసినప్పుడే.. నగరం అభివృద్ధి చెందినట్లు అని అన్నారు. తర్వాత గుడిమల్కాపూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో 3 నెలలుగా సరిగా కరెంట్ లేదని స్థానికులు తెలపడంతో వెంటనే ఆ పీహెచ్​సీని సందర్శించి సంబంధిత వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణులు, పేషెంట్ల బాధలు కనిపించడం లేదా? అని ఆఫీసర్లు ఇన్ని రోజులుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీహెచ్​సీలకు డబ్బులు ఇస్తున్నది కదా? ఎందుకు రిపేర్ చేయించలేదని ప్రశ్నించారు. ఇయ్యాల్నే పనులు మొదలుపెట్టి కరెంట్ వచ్చేలా చూస్తానని వైద్యాధికారి డాక్టర్ అనురాధ మంత్రికి వివరణ ఇచ్చారు. తర్వాత బన్సీలాల్ పేట డివిజన్ ​బీజేపీనేత కుర్మ శంకర్​తల్లి కుర్మ లింగమ్మ ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. శంకర్​ ఇంటికి వెళ్లి కిషన్​రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి లింగమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన వెంట పార్టీ నేతలు గౌతమ్ రావు, కరుణాకర్ తదితరులు ఉన్నారు.

‘వీ6 వెలుగు’ న్యూ ఇయర్  క్యాలెండర్ బాగుంది

న్యూఢిల్లీ, వెలుగు: లంబాడీ థీమ్​తో ‘వీ6 వెలుగు’ తెచ్చిన కొత్త సంవత్సరం 2023 క్యాలెండర్ బాగుందని కిషన్ రెడ్డి మెచ్చుకున్నారు. ఢిల్లీలోని తన కార్యాలయంలో క్యాలెండర్​ను చూసిన కేంద్ర మంత్రి.. వీ6 వెలుగు టీంను అభినందించారు. గిరిజనుల థీం గొప్ప ఆలోచన అని కితాబిచ్చారు. తెలంగాణలోని గిరిజన జాతులు, వారి సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టేలా వీ6 వెలుగు ఈ ఏడాది క్యాలెండర్​ను రూపొందించింది. కాయితి లంబాడ, కొమ్మకోయ, గోండు జాతుల నృత్యాలు, పండుగలను క్యాలెండర్ ద్వారా ప్రజల ముందుకు తెచ్చింది.